60వ పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్ లైవ్‌లో తన తన అభిమానులను గుర్తు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రతి ఏడాది తన పుట్టినరోజు వేడుకల నుంచి సినిమా ఫంక్షన్ల వరకూ అభిమానుల మధ్య జరుపుకోవడం అలవాటని.. కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితిలో వారితో వేడుకను జరుపుకోలేక పోవడం బాధగా ఉందని వెల్లడించారు బాలకృష్ణ.
"జీవితంలో మైలురాయి అయిన షష్టిపూర్తి వేడుకలను అభిమానులతో జరుపుకోలేకపోవడం చాలా బాధగా ఉంది. అన్ని ఫంక్షన్లనూ వారి మధ్య జరుపుకోవడం అలవాటు. కానీ, ప్రభుత్వ ఆదేశాలను మనందరం కచ్చితంగా పాటించి తీరాలి. అభిమానులు భౌతికంగా దూరంగా ఉన్నా.. సామాజిక మాధ్యమాల ద్వారా వారంతా నాకు దగ్గరగానే ఉన్నారు. నా పుట్టినరోజును పురస్కరించుకొని కామన్ డిస్ప్లే పిక్చర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది".