కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇది పుట్టిన చైనా దేశంలోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ కరోనా బారిన పడి వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ సోకి వేల మంది ప్రజలు అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీయులు చైనా చుట్టు పక్కల దేశాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ కరోనా వైరస్ నాగార్జున కొత్త చిత్రం వాయిదాకు కారణమైంది.
'వైల్డ్ డాగ్' చిత్రీకరణకు కరోనా వైరస్ భయం - వైల్డ్ డాగ్ సినిమా
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రాణాంతక మహమ్మారి. దీని వల్ల చైనాకు వెళ్లాల్సిన పర్యాటకులు వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా నాగార్జున కొత్త సినిమా చిత్రీకరణ వాయిదా వేయటానికీ ఇదే కారణమైంది.
నాగార్జున కథానాయకుడిగా 'వైల్డ్ డాగ్' సినిమా తెరకెక్కుతోంది. సాల్మోన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబయిలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో మొదలవ్వాలి. కానీ, కరోనా వైరస్ భయం వల్ల ఈ షెడ్యూల్‌ను రద్దు చేసుకుందట చిత్ర బృందం. అయితే, రద్దు చేసిన షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైవిధ్యభరిత క్రైమ్ థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఇదీ చూడండి..ఈవెంట్ రద్దు చేసుకున్న సల్మాన్.. అందుకోసమేనా..!