హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు దాడులను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించారు. ఎన్‌ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా నాగ్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకర్షిస్తోంది.
ఏప్రిల్ 2న 'వైల్డ్‌డాగ్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన సినిమా ప్రమోషన్‌లో నాగార్జున, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. నాగ్ పంచుకున్న కొన్ని విశేషాలు మీకోసం..
చిరు అలా అన్నారు..
"వైల్డ్‌డాగ్' ట్రైలర్ సిద్ధమయ్యాక ఆ వీడియో చూడమని ఓరోజు చిరంజీవిని అడిగాను. 'ఒకే నాగ్ చూస్తాను. కానీ ఏ రోజు అడగవు కదా! మరి ఇప్పుడు ఏంటి?' అని ఆయన అన్నారు. 'మీకు వీడియో నచ్చితే ట్రైలర్ లాంచ్ చేయాలని అడుగుదామనుకుంటున్నా' అని చెప్పాను. దానికి ఆయన.. 'ట్రైలర్ నచ్చినా నచ్చకపోయినా, సినిమా ఎలా ఉన్నా సరే. నువ్వు నాకు నచ్చుతావు నాగ్. కాబట్టి తప్పకుండా ట్రైలర్ లాంచ్ చేస్తా' అన్నారు. వీడియో చూశాక.. చాలా బాగుంది అని మెస్సేజ్ కూడా పెట్టారు."
మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
"చిరంజీవి తర్వాత మా సినిమా ట్రైలర్‌ను మహేశ్‌కు పంపించాను. మహేశ్ నుంచి వెంటనే స్పందన వచ్చింది. 'సూపర్ ఉంది సర్. నాకు బాగా నచ్చింది' అని రిప్లై ఇచ్చారు. ఆ స్క్రీన్‌షాట్‌నే ట్విటర్‌లో షేర్ చేశాను. అయితే, ట్రైలర్ లాంచ్ పట్ల మహేశ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగానైనా తమ అభిమాన హీరో.. వాట్సాప్ డీపీ చూసినందుకు వాళ్లు ఎంతో సంతోషిస్తూ కామెంట్లు పెట్టారు."