నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. "చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాన్ని నా మనసులోంచి తీసేశా. ఇప్పుడే మిమ్మల్ని కొత్తగా చూస్తున్నట్లుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే హైదరాబాద్‌లో జరిగిన బ్లాస్ట్ గురించి అందరికి తెలిసిందే. ఈ అంశంపైనే సినిమా తీశాం. ఆ బ్లాస్ట్‌లో బాంబులు పెట్టిన వ్యక్తులను పట్టుకోవడమే లక్ష్యంగా కథ సాగుతుంది. 'సార్ ఈ మిషన్కి వెళ్లామంటే తిరిగి వస్తామో? రామో.. నాకు ఏం జరిగినా పర్వాలేదు సర్. నేను పోయినా మా అమ్మకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు' డైలాగ్ నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ మిషన్కి నేను కమాండర్‌గా ఉంటాను. సయామీ ఖేర్ ఇందులో 'రా ఏజెంట్'గా పనిచేస్తుంది. మిగతా వాళ్లు అంతా 'ఎన్.ఐ.ఏ'లో ఉంటారు." అని అన్నారు.
"నేను ఈ పాత్ర కోసం ఎవరినీ కలవలేదు. దర్శకుడు ఏం చెబితే అదే చేశా. తొలుత చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. కరోనా వల్ల జనాలు థియేటర్లకు వస్తారా? అని అనుకున్నాం. అయితే అంతలోనే సంక్రాంతికి 'క్రాక్' సినిమా వచ్చి విజయం అందుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ వచ్చింది. దాంతో మాకు ధైర్యం వచ్చి, సినిమాని ఏప్రిల్ 2న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అడవిలో వైల్డ్ డాగ్స్ సింహాలను కూడా వేటాడతాయి. దాన్ని చంపేంత వరకు అవి విశ్రమించవు. అనుకున్నది సాధించే వరకూ వెనుదిరగవు. అందుకే ఈ సినిమాకు 'వైల్డ్ డాగ్' అని పేరు పెట్టారు. ఇక 'బంగార్రాజు' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నాం. జూన్ లేదా జులై చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నాం" అని నాగార్జున తెలిపారు.