టాలీవుడ్ కింగ్ నాగార్జున.. యువ హీరోలతో దీటుగా వరుస సినిమాలతో దూసుకెళ్తుంటారు. గతంలో పలు హిందీ చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు దాదాపు 17ఏళ్ల తర్వాత త్వరలోనే 'బ్రహ్మస్త్ర' సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్.. బీటౌన్‌లో రీఎంట్రీ ఇవ్వడంపై మాట్లాడారు. బాలీవుడ్లో స్థిరపడాలనే ఆలోచన లేనందువల్లనే అక్కడి చిత్రాల్లో నటించడానికి ఇంత సమయం పట్టిందని చెప్పారు.
"నా కెరీర్లో బాలీవుడ్ ఏ పాత్ర పోషిస్తుందో నాకు తెలీదు. అయినా నేను హిందీ పరిశ్రమను కెరీర్‌గా ఎంచుకోవాలనుకోలేదు. నన్ను, నా సినిమాలను బాలీవుడ్‌తో పాటు తమిళం, కేరళ, కర్ణాటకలోనూ ఆదరిస్తారు. అందువల్ల నాతో సినిమాలు చేయడం వల్ల నిర్మాతలు ఇంకాస్త ఆర్థికంగా లాభపడతారు. కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. నా కెరీర్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ నాకు బాలీవుడ్లో స్థిరపడాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు" అని నాగ్ అన్నారు.