లాక్‌డౌన్ సమయంలో కొందరు నటులు తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తుంటే నాగార్జున భవిష్యత్తు తరాలకు తెలుగు సినిమా ఖ్యాతిని తెలియజేసే ప్రయత్నంలో ఉన్నారు. దాని కోసం ఓ మ్యూజియం నెలకొల్పనున్నారు. ఆ వివరాలు ఓ ఆంగ్ల మీడియాతో ఇలా పంచుకున్నారు.
"2019లో అన్నపూర్ణ స్టూడియోలో చలన చిత్ర సంరక్షణ, పునరుద్ధరణ అనే వర్క్‌షాప్ నిర్వహించాం. మా స్టూడియోలో (అన్నపూర్ణ) ఉన్న సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాను. ఆ క్షణమే ఆణిముత్యాల్లాంటి మన తెలుగు సినిమాల కోసం ఓ మ్యూజియం ఎందుకు నిర్మించకూడదు? అనే ప్రశ్న మదిలో మెదిలింది. వెంటనే సంబంధిత వివరాలు సేకరించే పనిలో పడ్డాను. దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఆర్కివిస్ట్‌లను సంప్రదించాను. కొవిడ్ సంక్షోభం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మ్యూజియంకు కావాల్సిన వస్తువుల్ని సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. సినిమా ఓ కళ. ఇతర కళలకు సంబంధించి గ్రంథాలయాలు, మ్యూజియం ఉన్నట్టుగానే సినిమానూ కాపాడుకునేందుకు ఉండాలి. మా నాన్న గారు (అక్కినేని నాగేశ్వరరావు) మూకీ చిత్రాల కాలంలో నటుడిగా మారారు. సినిమా.. మాటలు లేని స్థాయి నుంచి ఇప్పుడు ఎంతో అభివృద్ది చెందింది. ఈ రోజు మనకు కావాల్సినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. మనం సినిమాకు ఏదైనా తిరిగి ఇవ్వాలి. మ్యూజియం ఏర్పాటు చేయడమే తెలుగు సినిమాకు మనం ఇవ్వగలిగింది. అదే నా కల".
- నాగార్జున, అగ్రకథానాయకుడు