Nagarjun about Bangarraju movie: నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్.. చిత్ర విశేషాలను గురించి తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
ఈ సారి పెద్ద ‘బంగార్రాజు’ చిన్న ‘బంగార్రాజు’తో కలిసి వస్తున్నారు.. ఎలా అలరించబోతున్నారు?
నాగార్జున:ఈరెండు చిత్రాలను పోల్చి చూస్తే మీరు చూడబోయే మార్పే అది. ఈసారి చిన్న ‘బంగార్రాజు’ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పెద్ద బంగార్రాజులో యూత్‌ఫుల్ ఎనర్జీ మిస్ అయ్యింది. ఇందులో నాగచైతన్య యూత్‌ఫుల్ ఎనర్జీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఈ చిత్రం కోసం ఏదైనా అదనపు బాధ్యతలు స్వీకరించారా?
నాగార్జున: ‘సోగ్గాడే.. ’బాగా ఆడింది. ప్రజలు కూడా ఆస్వాదించారు. అంగీకరించారు. దాన్ని ఇష్టపడిన వాళ్లు ఈచిత్రాన్ని చూడాలనుకుంటారు. ఈసారి దానికన్నా ఎక్కువ అలరించాలి. ఇది నాకే కాదు.. చైతూకీ పెద్ద బాధ్యతే. ఎందుకంటే నేను నిర్మాత కాబట్టి. మరొకటి పండగలాంటి సినిమా ఇస్తున్నామని ముందుకొచ్చాం.. అదొకటి మరో బాధ్యతలా అనుకుంటున్నా.
నాగ చైతన్యని చిన్న ‘బంగార్రాజు’గా చూపించడానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?
నాగార్జున: బ్లడ్‌లైన్ అనేది మనకు ముందు నుంచి వర్క్‌వుట్ అవుతూ వస్తోంది. రక్త సంబంధాలు ఉన్న నటులు కలిసి నటిస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ‘మనం’ విషయంలో కూడా అదే నిరూపితమైంది. అందుకే నాగచైతన్యని తీసుకున్నాం.
ఇలాంటి తండ్రీ కొడుకుల పాత్ర తెర మీద పోషిస్తున్నప్పుడు నిజజీవిత సంఘటనలు గుర్తొస్తాయి కదా! అలా నాన్నగారు గుర్తొచ్చారా?
నాగార్జున: ఈ పంచె కట్టు ధరించినప్పుడల్లా నాన్న గుర్తొస్తారు. ‘మనం’ సినిమాని వేరే నటులతో తీసి ఉంటే వర్కవుట్ అయ్యేది కాదు. అది డిజైన్డ్. మనం సినిమాలో ఆ మూడు తరాలు నాన్న, నేను, చైతూ లేకపోతే అంత బాగా వచ్చేది కాదు. బాలీవుడ్‌లో ‘మనం’ చాలా మందికి నచ్చడంతో రీమేక్ కూడా చేద్దామనుకున్నారు. కానీ మా కాంబినేషన్ వల్లే సినిమా వర్కవుట్ అయిందని తెలుసుకున్నారు. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కూడా తీద్దామనుకున్నారు. అయితే ఇదే కాంబినేషన్ అక్కడ వర్క్‌వుట్ అవ్వదేమోనని ఆగిపోయారు. ‘బంగార్రాజు’ కుడా అంతే.
ఈ ‘బంగార్రాజు’కి సీక్వెల్ వస్తుందంటారా?
నాగార్జున: సీక్వెల్ తీద్దామని ‘సోగ్గాడే..’ సమయంలో ఆలోచన లేదు. సినిమా బాగా ఆడిన తర్వాత దాని గురించి చూద్దామనిపించింది. అందులో ఉండే సీనియర్ బంగార్రాజు ఆత్మ ఎప్పుడైనా, ఎక్కడికైనా రావొచ్చు. కాబట్టి ‘బంగార్రాజు’ సీక్వెల్ ఉంటుందా.. లేదా? అన్నది ఒక వారంలో నిర్ణయం తీసుకొని చెబుతా (నవ్వులు)
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో మీ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మీ సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాంగ్స్ హిట్ అవ్వడంతో ‘మ్యూజికల్ నైట్’ కూడా నిర్వహించారు. మరి అనూప్ గురించి?
నాగార్జున: అలాని ఏం లేదండి. బయట కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నితిన్- నిత్యామేనన్ ‘ఇష్క్’లో సంగీతం నచ్చాక ‘మనం’కు ఒప్పుకొన్నాం. అనూప్ రూబెన్స్ మాకు స్పెషల్. టైమ్ ఇస్తాడు. టైమ్ తీసుకుంటాడు. అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబసభ్యుడిలా ఉంటాడు. ఇది బాలేదని చెప్పినా ఫీల్ అవ్వడు. మళ్లీ మంచి మ్యూజిక్‌తో వస్తాడు. నేను అడగక ముందే దర్శకుడు కల్యాణే అనూప్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘సోగ్గాడే..’ కన్నా ఇందులో సంగీతం బాగా ఇచ్చాడు. ‘మనం’కి ఎలా మ్యూజికల్ నైట్ చేశామో.. అలాగే ‘బంగార్రాజు’కి చేశాం.
‘బంగార్రాజు’ పాత్రని గతంలో మీరు చేశారు. ఇప్పుడు చైతూ చేస్తున్నారు. మరి బంగార్రాజు బాడీ లాంగ్వేజ్ పండేలా ఎలాంటి సలహాలు చైతూకి ఇచ్చారు?
నాగార్జున: ‘చైతూ’నే సోగ్గాడే నాలుగైదు సార్లు మళ్లీ చూశాడు. ఇందులో సినీయర్ బంగార్రాజు ఎంటర్ అయ్యాక మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చై డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. అవే చైతూ ఫాలో అయ్యేవాడు. నాకన్నా కల్యాణ్‌కి గోదావరి యాసపై పట్టుంది. సో, తను ఇంకా బాగా సలహాలిచ్చేవాడు.
మీరు ట్రెండీ పాత్రలు, పల్లెటూరి పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. ఆ కనెక్షన్ ఎలా కుదిరింది?
నాగార్జున:చిన్నప్పటి నుంచి నాన్న గారి నుంచే వచ్చింది (నవ్వుతూ). ప్రెసెడింట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు.. ఇలాంటి పాత్రల్లో బాగా ఒదిగిపోవచ్చు. అందులో పూర్తిగా ఓపెన్ అవ్వొచ్చు. పల్లెటూరి పాత్రల్లో చిన్నపాటి పొగరుబోతుతనం ఉంటుంది. అలాంటి పాత్రలు, భాషన్నా చాలా ఇష్టం.
మీ కెరీర్‌లో ‘నాగార్జున- రమ్యకృష్ణ’ అంటే సక్సెస్‌ఫుల్ జంట. మరి దాన్ని ఎలా నిర్వచిస్తారు?
నాగార్జున: ఓ గోల్డెన్ కాంబినేషన్ మాది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇద్దరం ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతాం. సెట్‌లో రమ్య ఉంటే సందడి వాతావరణమే. అందరినీ నవ్విస్తుంటుంది.