బుల్లితెర ద్వారా హాస్యాన్ని ప్రతి ఇంటికి చేర్చి...కోట్లాది మంది ప్రజలను కుటుంబంగా మార్చుకుంది ఈటీవీ. ఈ ఛానల్లో ప్రతి గురువారం ‘జబర్దస్త్’, శుక్రవారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ పేరుతో నవ్వులు పంచుతోంది. ఈ షోలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సినీ నటులు నాగబాబు, రోజాలు ప్రతి ఇంట తమదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇటీవలి ఎపిసోడ్లలో వీరిద్దరి సందడి కనపించడం లేదు. ఎందుకంటే తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు జనసేన నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రోజా నగరి ఎమ్మెల్యేగా ఉండి కూడా షోలో కనువిందు చేశారు. నాగబాబు మళ్లీ జబర్దస్త్ మానేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం నవ్వుల నవాబ్ నాగబాబు చెప్పారు.
'జబర్దస్త్' పై స్పష్టత ఇచ్చిన నాగబాబు
బుల్లితెరపై నవ్వులు పంచుతూ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న షో 'జబర్దస్త్'. న్యాయనిర్ణేతలుగా ఉన్న నాగబాబు, రోజా తాజాగా వచ్చిన ఎపిసోడ్లలో సందడి చేయటం లేదు. నాగబాబు మళ్లీ ఈ షోలో కనిపిస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. తాజాగా ఓ ఇంటర్వూలో ఆయన సమాధానం ఇచ్చారు.
‘జబర్దస్త్’ అనేది ఒక సర్వీస్ లాంటింది. అయితే ఇది పెయిడ్ సర్వీస్. వినోదాన్ని పంచుతూ నాకు కొంత ఆదాయాన్ని ఇస్తోంది. దాని కంటే ప్రజల్ని నవ్వించే ఒక షోలో భాగం కావడం నాకు నచ్చింది. ఇదే నాకు గుర్తింపు తెచ్చింది. నేను ఈ షోకు కేటాయించేది నాలుగైదు రోజులు. ఒక వేళ నేను ఎంపీగా ఎన్నికైనా...ఈ విధంగా ప్రజలకు చేరువకావడానికి ఏ ఇబ్బంది లేదు. నేను కచ్చితంగా ఈ షో చేస్తా. కాని సినిమాల్లో మాత్రం నటించలేకపోవచ్చు. ప్రజలకు నచ్చిన షో కాబట్టి తప్పకుండా ఇది కొనసాగిస్తా.
--నాగబాబు, సినీ నటుడు