ప్రేమకథలకు సరిగ్గా సరిపోతాడు హీరో నాగశౌర్య. తనకు విజయాల్ని అందించిన సినిమాలన్నీ లవ్ స్టోరీలే. 'ఊహలు గుసగుసలాడే' నుంచి 'ఛలో' వరకూ ఓ అల్లరి ప్రేమికుడిగా మురిపించాడు. అయితే మధ్యలో మాస్ ప్రయత్నాలు చేయడం మానలేదు. అందులో 'జాదూగాడు' ఒకటి. ఇప్పుడు మరోసారి ఓ విభిన్నకథను ఎంచుకున్నాడు. అదే 'అశ్వథ్థామ'. ఐరా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించాడు ఆ విశేషాలివే.
ఈ కథ కోసం మీరు చేసిన కసరత్తు ఏంటి?
దేశమంతా తిరిగాను. ఎక్కడెక్కడ ఎలాంటి అకృత్యాలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేశాను. బాధితులతో మాట్లాడాను. కొంతమంది నా మొహం మీదే తలుపులేశారు. మాట్లాడడానికి ఇష్టపడలేదు. వాళ్ల జీవితాల్ని ఆ ఘటనలు అంతగా అతలాకుతలం చేశాయన్నమాట. ఈ ప్రయాణంలో నన్ను నేను తెలుసుకున్నాను. వ్యక్తిగా చాలా మారాను. అందుకే ఈ సినిమా నా మనసుకు చేరువైంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉండాలని సినిమా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను.
దర్శకత్వం చేయాలన్న ఆలోచన రాలేదా?
లేదు. నేను కేవలం కథకుడిగానే ఆలోచించాను. రమణ తేజ ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. పైగా ముందు నుంచీ ఈ కథతో పాటు తను ప్రయాణం చేస్తూ వచ్చాడు. తన ఆలోచనలు బాగా ఉపయోగపడ్డాయి. సెట్‌కు వెళ్లే ముందే ఏ సన్నివేశం ఎలా తీయాలి? ఎలాంటి లెన్సులు వాడాలి? అనే విషయాలపై చాలా కసరత్తు చేశాం. పేపర్‌లో రాసుకున్నదే తెరపై తీశాం.
'ఖైదీ', 'ఖాకీ' ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ జోనర్‌లో సాగే సినిమానా?
ఆ ప్రభావం 'అశ్వథ్థామ'పై ఉంది. ఎందుకంటే అవన్నీ నిజాయతీగా తీసిన సినిమాలు. కమర్షియల్ హంగుల కోసం పాటలు, ఫైట్లు పెడదాం అని ఆలోచించలేదు. 'అశ్వథ్థామ' విషయంలోనూ అదే జరిగింది. తెరపై కనిపించిన ప్రతి పాత్రకూ, ప్రతి సన్నివేశానికీ ఓ అర్థం ఉంటుంది.
మీకు ప్రేమకథలు బాగా నప్పుతాయి కదా, జోనర్ మార్చాలనుకుంటున్నారా?
ప్రేమకథలు చేసీ చేసీ బోర్ కొట్టింది. రోజా పువ్వు పట్టుకోవడం, ఐ లవ్ యూ అంటూ అమ్మాయి వెంట పడడం, తాను కాదంటే, ఓ విషాద గీతం వేసుకోవడం... ఇదే జరుగుతోంది. షూటింగ్‌కు వెళ్తున్నాను అనే ఉత్సాహం లేకుండా పోతోంది. 'నాగశౌర్య అన్నీ చేయగలడు..' అని నిరూపించాలన్న ప్రయత్నం నాది.
'అశ్వథ్థామ' సినిమాలో నాగశౌర్య-మెహరీన్ ప్రేమకథల్లోనూ కొత్త కోణాలు చూపించొచ్చు కదా?
ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అలాంటిదే. నా పాత్రలో ఏకంగా ఏడు కోణాలుంటాయి. అవేంటన్నది చాలా ఆసక్తికరం. చేస్తే.. అలాంటి ప్రేమకథలే చేయాలి.
రాఘవేంద్రరావు నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి..?
అవును. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. కథ విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
మీ సంస్థలో వేరే హీరోలతో సినిమాలు చేస్తారా?
ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఓ కథ రాస్తున్నా. రెండు మూడు నెలల్లో సినిమా మొదలవుతుంది. హీరో ఎవరన్నది కథ రాశాకే తెలుస్తుంది.
'అశ్వథ్థామ'లో హీరో నాగశౌర్య ఈ చిత్రానికి 'అశ్వథ్థామ' అనే పేరు పెట్టడానికి కారణమేంటి?
ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అందరూ వినోదం చూస్తే... అశ్వథ్థామ ఒక్కడే ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే గుణంలోంచే ఈ కథ పుట్టుకొచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలకు ఎదురొడ్డే కుర్రాడి కథ ఇది. అందుకే ఆ పేరు పెట్టాం.
ఈ కథ రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి?
ఏ రోజు పేపర్ చూసినా ఏదో వార్త మనల్ని కదిలిస్తూనే ఉంటుంది. ఈమధ్య దిశ ఘటన అలాంటిదే. మన దృష్టికి రాకుండా ఇలాంటి అన్యాయాలు ఇంకెన్ని జరుగు తున్నాయో..? నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఘటన చాలా కదిలించింది. అది చెబితే 'ఇలాక్కూడా జరుగుతుందా?' అని ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తిగా నేనేమీ చేయలేకపోవొచ్చు. కానీ ఇలాంటి సినిమాల ద్వారా కొంతమందినైనా జాగృతం చేయాలనుకుంటున్నాను.
'నర్తనశాల' నన్ను చాలా నిరాశ పరిచింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే... ఎలాంటి వాతావరణం ఉంటుందో, సరిగ్గా అంతే విషాదాన్ని ఏకంగా ఆరు నెలలు మా ఇంట్లో చూశాను. డబ్బులు పోయినందుకు ఏనాడూ ఆలోచించలేదు. కానీ అమ్మానాన్నలను తలదించుకునేలా చేశానే అని బాధ పడ్డాను. వాళ్లు నన్నెప్పుడూ నిందించలేదు. 'మా అబ్బాయికి ఓ ఫ్లాప్ ఇచ్చామే' అని వాళ్లు బాధ పడ్డారు. అది నన్ను మరింత బాధపెట్టింది. 'నర్తనశాల' ఆడదని నాకు ముందే తెలుసు. కానీ ఇచ్చిన మాట కోసం చేసిన సినిమా అది. ఒకరికి మాటిచ్చాను, అది నిలబెట్టుకోకపోతే ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అందుకే ఆ తప్పు చేయాల్సివచ్చింది. ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు చేయను. హిట్టూ, ఫ్లాపూ మన చేతుల్లో లేదు. కానీ మంచి సినిమాలు, మన గౌరవాన్ని పెంచే కథలు చేయొచ్చు కదా? 'అశ్వథ్థామ' అలాంటి సినిమానే.