ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. రామ్ చరణ్‌కు ఓ వినూత్న కథ వినిపించాడని, చెర్రీకీ నచ్చడం వల్ల దాదాపు వారిద్దరి కాంబినేషన్లో సినిమా ఖరారైందని వార్తలొచ్చాయి. దీంతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత చెర్రీ నటించబోయేది విక్రమ్ దర్శకత్వంలోనే అని టాలీవుడ్లో ప్రచారం జరిగింది. కానీ, ఈ దర్శకుడు ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోందని తెలుస్తోంది.
'మనం' దర్శకుడితో మరోసారి నాగచైతన్య!
గతేడాది 'గ్యాంగ్‌లీడర్'తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ప్రస్తుతం మరో ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే నాగచైతన్యకు కథ వినిపించాడని.. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ కథ నచ్చడం వల్ల చైతూ వెంటనే అంగీకరించాడని టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న 'లవ్‌స్టోరీ' పూర్తయ్యాక విక్రమ్ చిత్రం పట్టాలెక్కిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అక్కినేని మూడు తరాల కథానాయకులతో 'మనం' చిత్రం తెరకెక్కించి దర్శకుడిగా మంచి విజయం అందుకున్నాడు విక్రమ్. అందుకే చైతూ మరోసారి అతడితో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాడట. మరి చెర్రీకి చెప్పిన కథ ఏమైంది? చైతూని డైరెక్ట్ చేశాక చెర్రీతో సినిమా చేస్తాడా? చెర్రీ కథనే చైతూతో చేస్తున్నాడా అనే సందేహం సినీ వర్గాల్లో మొదలైంది. అన్నింటికి సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
ఇదీ చూడండి.. సరికొత్త ప్రయోగాలతో ప్రత్యేకత చాటుతోన్న 'విక్రమా'ర్కుడు!