"కరోనా వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపకండి. అందరం కలిసి ధైర్యంగా పోరాడటం ద్వారానే ఈ మహమ్మారి బారి నుంచి బయట పడగలం" అంటున్నాడు టాలీవుడ్ ప్రముఖ హీరో నాగచైతన్య. ప్రస్తుతం కరోనా సోకిన కుటుంబాలు, వ్యక్తుల పట్ల సమాజంలో అనేక చోట్ల వివక్ష కనిపిస్తోంది. అలాగే వైరస్‌పై ప్రజల్లో అనేక భయాలు, అపోహలు నెలకొని ఉన్నాయి. అందుకే వీటన్నింటిపైనా అవగాహన కల్పించే ఉద్దేశంతో.. దర్శకుడు శేఖర్ కమ్ముల విసిరిన సవాల్ మేరకు నాగచైతన్య తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
'కరోనా అందరి సమస్య.. కలిసే పోరాడుదాం'
కరోనాతో ధైర్యంగా పోరాడటమే ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గమని టాలీవుడ్ హీరో నాగచైతన్య అన్నాడు. వైరస్ సోకిన వారి పట్ల సమాజంలో వివక్ష చూపిస్తున్న నేపథ్యంలో.. వీటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా కొవిడ్‌ను జయించిన సునీత అనే నర్సుతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించి.. వ్యాధిపై పోరులో ఆమె అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం చైతన్య మాట్లాడుతూ.. "కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి. వైరస్ నుంచి కోలుకున్నాక మీ అనుభవాల్ని అందరితో పంచుకోండి. కరోనాను జయించిన తర్వాత ప్లాస్మా దానం చేయడం మర్చిపోకండి. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆ సాయం చాలా మంది ప్రాణాల్ని నిలబెడుతుంది" అని తెలిపాడు.