Actor Vishal Nadigar sangam elections: నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం అవసరమైతే భిక్షాటన చేస్తానన్నారు నటుడు విశాల్. నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ ప్రమాణ స్వీకారం చేశారు.
"చరిత్రలో మొదటిసారి నటీనటుల ఎన్నికల ఫలితాలు మూడేళ్ల తర్వాత ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, ఎన్నికలు నిజాయితీగా నిర్వహించిన సిబ్బందికి ధన్యవాదాలు. అసోసియేషన్ భవనం నిర్మించడం సహా సంస్థను ముందుకు తీసుకువెళ్లడానికి కృషిచేస్తాం. టెన్నిస్ కోర్టు మినహా అన్ని కోర్టుల చుట్టూ తిరిగాము. అందువల్లే నా వివాహం, భవన నిర్మాణం ఆలస్యమైంది. ఈ బిల్డింగ్‌తో పాటు చెన్నై వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేస్తాం. 60 శాతం పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తవుతాయి. మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయి. వీటి కోసం 21 కోట్లు అవసరమవుతాయి. ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరతున్నా. అవసరమైతే భిక్షాటన చేసి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడాను.శరత్‌కుమార్, గణేశ్‌లు ఆర్థిక సహాయం చేస్తే తీసుకుంటాం. అందరిని కలుపుకొని వెళ్లడమే మా లక్ష్యం.