తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మొదట్లో చాలా భయపడ్డా.. కానీ ఆ తర్వాత!

'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ వస్తున్న నభా నటేశ్.. త్వరలో సినిమా విడుదల కానున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. లాక్​డౌన్​లో షూటింగ్​లో తనకెదురైన అనుభవాల్ని వెల్లడించింది.

nabha natesh about solo brathuke so better cinema and lockdown experience
మొదట్లో చాలా భయపడ్డా.. కానీ ఆ తర్వాత!

By

Published : Dec 21, 2020, 8:06 PM IST

'నన్ను దోచుకుందువటే'తో అందరి హృదయాలను దోచుకుంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో వరంగల్‌ పోరగాళ్లను.. అంటూ డైలాగ్‌ చెప్పి కుర్రకారును హోరెత్తించింది. ఈసారి పూర్తి భిన్నమైన పాత్రలో అమృతగా అలరించబోతోంది. తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమె ఇస్మార్ట్‌ భామ నభా నటేశ్‌. ఆమె నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌'.. డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా.. చిత్ర పరిశ్రమకు ఎంతో ముఖ్యమంటున్న ఆమె.. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్‌లో రాబోయే తొలి సినిమా కాబట్టి తానూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. వయసుతో సంబంధం లేకుండా ఈ సినిమాను అందరూ ఆస్వాదించవచ్చని చెప్పింది.

హీరోయిన్ నభా నటేశ్

కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది.?

నాదే కాదు. కరోనా వల్ల అందరి జీవితాలు స్తంభించిపోయాయి. అందర్నీ బాగా ఇబ్బంది పెట్టింది. మా సినిమా ఇండస్ట్రీ లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ మొదటి నుంచి ప్రయాణం మొదలుపెట్టినట్లుగా ఉంది. 2020 కొంచెం బెటర్‌గా ఉండాల్సింది.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’లో చేయడానికి కారణం..?

హీరోయిన్‌ పాత్ర. ఈ పాత్రకు నేనైతే సరిగ్గా సరిపోతానని డైరెక్టర్‌ సుబ్బు నాకు చెప్పారు. కథ విన్న తర్వాత మరో మాట లేకుండా సినిమా చేస్తున్నానని సుబ్బుతో చెప్పేశా. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు తర్వాత మీకే తెలుస్తాయి. చిన్నాపెద్దా.. అని తేడా లేకుండా ఎవరైనా చూసే వీలున్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం లోటుండదు. కథ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా చూస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది.

'సోలో బ్రతుకే సో బెటర్'లో సాయితేజ్ నభా నటేశ్

కరోనా సమయంలో షూటింగ్‌.. భయమనిపించలేదా..?

లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే మేం ‘హే ఇది నిజమేనా’ పాట షూట్‌ చేశాం. తొలి రెండుమూడు రోజులు సెట్‌లో ఏది తాకాలన్నా భయపడేదాన్ని. ఆ తర్వాత కొద్దికొద్దిగా భయం తగ్గిపోయింది. అయినా.. సెట్లో ప్రతి అంగుళం శానిటైజ్‌ చేస్తారు. నిజానికి శానిటైజర్‌ అంటే నాకంతగా ఇష్టం ఉండదు. కానీ.. నేను కూడా మాటిమాటికి శానిటైజర్‌ రాసుకునేదాన్ని. అదే సమయంలో నా మేకప్‌ చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాను.

సాయితేజ్‌తో నటించడం ఎలా ఉంది..?

సాయితేజ్‌ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో కలిసి చేయడం నాకు ఒక మంచి అనుభూతి. తోటి నటులతో ఆయన చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నేనైతే ‘అమృత’ పాత్రను బాగా ఆస్వాదించాను. సినిమా షూటింగ్‌ అయిపోయినప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అయ్యో అప్పుడే ఆ పాత్రను వదిలిపెట్టాల్సి వస్తుందని ఫీల్‌ అయ్యాను.

హీరోయిన్ నభా నటేశ్

మీరు సినిమా థియేటర్‌లో చూస్తారా..?

కచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం లేదు. టీవీ, ఓటీటీల్లో చూసి థియేటర్‌ థ్రిల్‌ను మిస్‌ అవుతున్నాం. నేనైతే సినిమాను థియేటర్‌లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజానికి మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి థియేటర్లో విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.

సినిమా పాటల గురించి చెప్పండి..

కరోనా వల్ల సినిమాలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేయాల్సి వచ్చింది. అయినా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘హే ఇది నిజమేనా’ పాట గురించి చెప్పాలి. ఆ పాట తర్వాత చాలా మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి అభినందించారు. బయట కూడా ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది. తమన్‌ మరోసారి మంచి సంగీతం అందించారు.

హీరోయిన్ నభా నటేశ్

నిజజీవితంలో విరాట్(ఈ సినిమాలో హీరో) ఎప్పుడైనా కలిశారా..?

అలాంటి అవకాశం రాలేదు. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు బయట ఉండటం చాలా కష్టం. ఇప్పటివరకైతే ఇలాంటి వ్యక్తి నాకు తారసపడలేదు. అలా ప్రేమ లేఖలు రాయడంలాంటి క్రేజీ మూమెంట్స్‌ కూడా లేవు.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు..?

నాకు ఛాలెంజింగ్‌ అనిపించే పాత్రలు ఏవైనా చేస్తా. ఒకేరకమైన పాత్రలు కాకుండా ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రలు ఎంచుకుంటా. పాత్రలే కాదు.. సినిమా విషయంలోనూ వైవిధ్యం చూపించాలనుకుంటున్నా.

ఈ సినిమాలో ‘అమృత’ పాత్ర మీ నిజజీవితాన్ని పోలి ఉంటుందా..?

సినిమాలో హీరోయిన్‌ ‘అమృత’ విలువలు గల కుటుంబానికి చెందిన అమ్మాయి. తల్లిదండ్రుల మాటను జవదాటదామె. నా నిజజీవితంతో పోల్చి చూస్తే కేవలం 20 నుంచి 30శాతం మాత్రమే పోలికలు ఉండే అవకాశం ఉంది.

'సోలో బ్రతుకే సో బెటర్' పోస్టర్​

సినిమా ఓటీటీకి వెళుతుందని వార్తలు వచ్చినప్పుడు మీరెలా ఫీల్‌ అయ్యారు..?

ఇది పక్కా థియేటర్‌కు సెట్‌ అయ్యే సినిమా. తెరపై చూసిన దానికి ఓటీటీ లేదా టీవీలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. మొదట్లో మా సినిమా ఓటీటీలో విడుదల చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నాకు కొంచెం వెలితిగా అనిపించింది. కానీ.. చివరికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో చాలా సంతోషం కలిగింది.

ఇస్మార్ట్‌ చాందినీ-అమృత ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఎలా కుదిరింది..?

ఒక పాత్ర నుంచి మరో పాత్రకు ట్రాన్స్‌ఫార్మేషన్‌ అనేది చాలా కష్టమైన విషయం. అయితే.. ఈ విషయంలో నాకు నేను స్వీయశిక్షణ తీసుకున్నాను. ఇంటికి వెళ్లగానే అద్దం ముందు కూర్చొని నా నటనను నేనే గమనించేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి దక్షిణాది సినిమాలు చూస్తూ పెరిగాను. మన దగ్గర మాస్‌ సినిమాలు ఎక్కువ. అలాగే క్లాస్‌ సినిమాలకూ కొదవ లేదు. అలా సినిమాలు చూస్తూ నాకు నేను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వస్తున్నా. ఒక నటిగా మనకు ఇచ్చిన పాత్రను బాగా చేయాలి. ప్రస్తుతం అదే నా ముందున్న లక్ష్యం.

థియేటర్‌లో 50శాతం నిబంధనపై మీ అభిప్రాయం.

థియేటర్‌ హౌస్‌ఫుల్‌గా ఉంటేనే బాగుంటుంది. కానీ, ఏదీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండటం మేలు కదా(నవ్వుతూ). ఇప్పుడున్న పరిస్థితుల్లో 50శాతం ప్రేక్షకుల నిబంధన చాలా ముఖ్యం. సామాజిక దూరం పాటించాలి కాబట్టి ఆ నిబంధన మనం కూడా పాటించాల్సిందే.

'సోలో బ్రతుకే సో బెటర్' పోస్టర్​

2021 ప్రణాళికలు ఏంటి..? వెబ్‌ సిరీస్‌లలో చేయడం లేదా..?

లాక్‌డౌన్‌ వల్ల సినిమాలన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. 2021 గురించి ఇప్పటికైతే ఎలాంటి ప్లాన్స్‌ వేసుకోలేదు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్‌’లో చేస్తున్నా. ఆ సినిమా షూటింగ్‌పూర్తి కావస్తోంది. నితిన్‌తో ‘అంధాదున్‌’ రీమేక్‌లో నటిస్తున్నా. లాక్‌డౌన్‌లో కొన్ని వెబ్‌ సిరీస్‌ అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిపై అంత ఆసక్తి చూపించలేదు.

ABOUT THE AUTHOR

...view details