"నటిగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ప్రతి సినిమాలోనూ నటనకి అవకాశం ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి... కొత్తగా ఇంకేదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కథలే నా దగ్గరికి వస్తున్నాయి" అంటోంది కథానాయిక నభా నటేష్. థియేటర్లు తెరిచాక వరుసగా సినిమాలతో సందడి చేస్తోందీమె. గత నెలలో వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'లో అమృతగా అలరించింది నభా. సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలవుతున్న 'అల్లుడు అదుర్స్'లోనూ ఓ కథా నాయికగా నటించింది. ఈ సందర్భంగా నభా నటేష్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.
వరుసగా మీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఉత్సాహంగా ఉన్నట్టున్నారు?
కొంచెం ఉత్సాహం, ఉత్కంఠ (నవ్వుతూ). మామూలుగా సినిమా సినిమాకీ మూడు నెలలైనా విరామం ఉంటుంది. ఈసారి వెంట వెంటనే వస్తున్నాయి. దాంతో 'సోలో...' విజయాన్ని ఆస్వాదించేలోపే, 'అల్లుడు అదుర్స్' విషయంలో ఆత్రుత మొదలైంది. 2020 నాకు ఎలాగైతే సుఖాంతమైందో, ఈ యేడాది అలాగే ఆరంభం అవుతుంది. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుంది. మంచి కథ... దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దాన్ని నడిపించిన విధానం నాకు బాగా నచ్చాయి.
ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
చాలా భిన్నంగా ఉంటుంది. ఇందాక ఇలా కనిపించింది, అంతలోనే ఇలా ఏంటి అని ఆశ్చర్యపోతారు. పాత్ర సాగే విధానంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఒక నటిగా నేను ఏది చేయాలనుకున్నానో అది ఇందులో చేశా. నాకు ఈత రాదు కానీ, స్విమ్మర్‌గా కనిపిస్తాను. పగలు చిత్రీకరణలో పాల్గొంటూ, రాత్రిళ్లు ఈత కొట్టడం నేర్చుకుని ఇందులో నటించా.