ఇంకా సెట్స్‌పైకి వెళ్లనే లేదు కానీ, పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండల క్రేజీ ప్రాజెక్ట్ 'ఫైటర్'పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కిక్ బాక్సింగ్ కథతో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్ కనిపించబోతుందని, తల్లి పాత్రను రమ్యకృష్ణ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రధాన ప్రతినాయకుడి పాత్రకు 'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయను ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడీ వార్తలన్నింటినీ తలదన్నే మరో పెద్ద వార్తొకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. టైసన్‌ను భారతీయ తెరకు పరిచయం చేయాలని మన చిత్ర దర్శకులెవరైనా ప్రయత్నించారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు పూరి మాత్రం ఆ ప్రయత్నాన్ని చేయబోతున్నట్లు మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.