ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే.. అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవలే రజనీకాంత్ ప్రకటించారు. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు అభిమానులు గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్ స్పందించారు.
"తలైవా నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని చాలామంది సోషల్‌మీడియా వేదికగా నాకు మెస్సేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పడం కోసమే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. రజనీ నిర్ణయంతో మీరు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో అదేవిధమైన నిరాశను నేనూ చవిచూస్తున్నాను. తలైవా రాజకీయాల్లోకి రాకపోవడానికి వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే ఆయన రావాలని మనం వేడుకోవచ్చు. కానీ ఆయన ప్రధాన కారణం అనారోగ్యం. ఒకవేళ మనవల్ల ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని.. మళ్లీ అనారోగ్యానికి గురైతే జీవితాంతం మనం సిగ్గుతో బాధపడాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టనప్పటికీ ఆయన ఎప్పటికీ నా గురువే. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనందరం దేవుడిని ప్రార్థిద్దాం."