తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా చేసుంటే 'క్రాక్​' నుంచి తీసేసేవాళ్లు కదా: తమన్ - తమన్ కాపీ సాంగ్స్

తన పాటలు కాపీ అంటూ వస్తున్న విమర్శలపై సంగీత దర్శకుడు తమన్ స్పందించారు. తనను టార్గెట్​ చేసే అలా చేస్తున్నారని అన్నారు. 'క్రాక్' విడుదల సందర్భంగా దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

music director thaman about songs plagiarism and 'krack' movie
అలా చేసుంటే 'క్రాక్​' నుంచి తీసేసేవాళ్లు కదా: తమన్

By

Published : Jan 4, 2021, 6:39 AM IST

Updated : Jan 4, 2021, 11:47 AM IST

ఉర్రూతలూగించే హుషారైన పాటలకు.. మదిని మైమరపించే మెలోడీ గీతాలకు చిరునామా.. తమన్‌. 'అల వైకుంఠపురములో' చిత్రంతో జాతీయ స్థాయిలో సినీ సంగీత ప్రియుల్ని మురిపించిన ఆయన.. ఇప్పుడు దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న రవితేజ 'క్రాక్‌' సినిమాకు ఆయనే స్వరాలందించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. ఈనెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే 'ఈనాడు సినిమా'తో ఆదివారం ప్రత్యేకంగా ఫోన్లో ముచ్చటించారు తమన్‌.

అందరికీ 2020 పీడకల. మీకు మాత్రం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచినట్లుంది కదా?

అవునండి. నిజానికి ఈ క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌లదే. వాళ్లు నాకిచ్చిన ఎనర్జీ, వాళ్లు నాపై ఉంచిన నమ్మకం వల్లే 'అల వైకుంఠపురములో' చిత్రంతో గొప్ప విజయం అందుకోగలిగాం. ఆ పాటలకు ఇంతటి ఆదరణ వస్తుందని మేమెవ్వరం ఊహించలేదు. నిజానికి ఇవి ఊహించి చేస్తే వచ్చేవి కాదు. అందరం నిజాయితీగా కష్టపడి పని చేశాం. దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నాం.

దర్శకుడు త్రివిక్రమ్​తో తమన్

'క్రాక్‌'లో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?

'క్రాక్‌' కథే మరో స్థాయిలో ఉంటుంది. దర్శకుడు గోపీచంద్‌.. దిమ్మతిరిగిపోయేలా, ఎంతో అందంగా స్క్రిప్ట్‌ రెడీ చేశారు. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. రవితేజతో నాకిది 11వ చిత్రం. ఆయన ఎనర్జీ, ఆయన పాత్రను గోపీ తీర్చిదిద్దిన తీరు, కెమెరామెన్‌ జి.కె.విష్ణు పనితనం.. ఇవన్నీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇప్పటికే బయటకొచ్చిన మూడు పాటలకూ మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు 'బిర్యానీ' అని మరో పాట విడుదల చేయబోతున్నాం. నిజానికి ఈ చిత్రంలో "భల్లేగా తగిలావే బంగారం" పాటను రవితేజతోనే పాడిద్దామనుకున్నాం. కానీ, అది ఆయన రేంజ్‌కు సరిపోతుందో.. లేదో? అనిపించి వెనక్కి తగ్గాం.

క్రాక్​ సినిమాలో రవితేజ

కొత్తగా ఓ సినిమా ఎంచుకున్నప్పుడు కథ మొత్తం వింటారా? పాట సిచ్యువేషన్‌ వరకు తెలుసుకుంటారా?

కచ్చితంగా కథ వినే సినిమా ఒప్పుకుంటాం. ఏం తెలుసుకోకుండా సొంతంగా పాటలు కట్టుకోలేం కదా. కాబట్టి పక్కాగా కథ వినాలి.

ప్రతి సినిమాకూ మంచి పాటలివ్వాలనే కష్టపడుతుంటారు. కానీ, కొన్ని పాటల విషయంలో 'కాపీ' అని విమర్శలు ఎదురవుతుంటాయి. ఎలా అనిపిస్తుంటుంది?

ఓ పాట బయటకు వదిలేముందు మేం అందరం వినే బయటకు వదులుతాం కదా. ఆడియో కంపెనీలు, మా లిరిక్‌ రైటర్లు, నాతో పనిచేసే వాళ్లకు తెలివి లేదంటారా. అయ్యో ఇలా కాపీ కొట్టేశాడేంటి? అని వాళ్లకు తెలియదా? ఒకవేళ నిజంగా నేనలా కాపీ కొట్టినా.. దర్శక నిర్మాతలకు నా ముఖం ఎలా చూపిస్తా? వాళ్లకూ రోషం వస్తుంది కదా. 'నువ్వేలా కాపీ కొట్టావ్‌?' అని అడుగుతారు కదా. ఎవరో కొందరు పనిలేక చేసే విమర్శల్ని నేను సీరియస్‌గా తీసుకొని ఉంటే.. ఎక్కడో ఆగిపోయి ఉండేవాణ్ని. 'బిజినెస్‌మెన్‌' నా పదకొండో చిత్రం అనుకుంటా. ఆ చిత్రంలో "పిల్లా చావ్‌" పాటతో నాకొచ్చినంత చెడ్డ పేరు మరెవరికీ వచ్చుండదు. ఆ విమర్శల్ని పట్టించుకొని ఉంటే నేను అక్కడే ఆగిపోయి ఉండాలి కదా. దాని తర్వాత నేను వందకు పైగా చిత్రాలు చేశా. ఎవరు నన్ను ఆపారు. నన్ను నమ్మి దర్శకులు అవకాశాలిస్తున్నారు.. నిర్మాతలు కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారు. ఇప్పుడున్న పెద్ద హీరోల సినిమాల్లో చాలా వరకు నేనే చేస్తున్నా. ఇండస్ట్రీ నన్నెంతో నమ్మబట్టే కదా.. ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నా. ఇవన్నీ చూశాకైనా అందరి విమర్శలకు సమాధానం దొరికి ఉండాల్సింది. కనీసం ఎవరూ ఆ ఆలోచన కూడా చేయట్లేదేమో. వాళ్లందరికీ ఏంటంటే 'అల వైకుంఠపురములో'తో నాకు ఊహించనంత పేరొచ్చేసింది. దాంతో వీడ్ని ఎలా టార్గెట్‌ చెయ్యాలి. ఎలా దింపాలి? అని కొంతమంది దాని కోసమే పనిచేస్తున్నారు. వాళ్లకు నేను సమాధానం చెప్పాలంటే రెండు నిమిషాలు పడుతుంది. ఇప్పుడు "భల్లేగా తగిలావ్‌" కూడా కాపీ అంటున్నారు. నిజంగా అది కాపీ అయితే దానికి సంబంధించిన వాళ్లు ఎవరో ఒకరు మాపై ఈపాటికే కేసు వేసేవారు కదా. అసలు నేనలా చేసుంటే 'క్రాక్‌' నుంచి నన్ను తీసేసేవాళ్లు కదా. పోనీ కాపీ అని ముద్ర వేసిన వాళ్లకు దమ్ముంటే.. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్‌ చేసి చూపించమనండి.

సంగీత దర్శకుడిగా మీ అతి పెద్ద లక్ష్యమేంటి? ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి?

'అరవింద సమేత' ముందు వరకు నాకున్న పెద్ద లక్ష్యం ఒకటే. త్రివిక్రమ్‌ సర్‌తో పనిచేయాలి. ఆయనతో రెండు సినిమాలు చేశా. ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌', 'అయ్యప్పునుమ్‌ కోశియుమ్‌ట తెలుగు రీమేక్‌, 'సర్కారు వారి పాట', బాలకృష్ణ -బోయపాటి సినిమా.. ఇలా మరిన్ని పెద్ద సినిమాలు చేస్తున్నా.

ఎక్కువగా దక్షిణాది చిత్రాలకే పరిమితమవుతున్నారు? బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదా?

బాలీవుడ్‌ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే నాకు ఏది బాగుంటుంది? ఏది ఉండదు? అని చూసుకొని ముందడుగేస్తున్నా. ఆ మధ్య 'గోల్‌మాల్‌', 'సింబా' చేశా. 'సూర్యవంశీ'లో ఓ పాట చేశా. భవిష్యత్తులో అక్కడ కూడా పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తా.

Last Updated : Jan 4, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details