తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రమ్మర్​గా కెరీర్​ మొదలుపెట్టి..​ సంగీత దర్శకుడిగా ఎదిగి - తమన్​ పుట్టినరోజు వార్తలు

చిన్నతనంలోనే కష్టాల కడలిని దాటి ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు ఎస్​.ఎస్​.తమన్​. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాడానికి ఎంచుకున్న వృత్తి.. ఇప్పుడు అతడిని ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. సోమవారం(నవంబరు 16) తమన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం.

Music Director S.S. Thaman birthday special story
డ్రమ్మర్​గా కెరీర్​ ఆరంభించి.. పాపులర్​ సంగీత దర్శకుడిగా ఎదిగి

By

Published : Nov 16, 2020, 9:56 AM IST

తొమ్మిదేళ్ల వయసులో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు.. 13 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు.. కుటుంబాన్ని కష్టాల కడలి నుంచి తప్పించడం కోసం చదువుకు స్వస్తిపలికాడు.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తన అభిరుచిని వృత్తిగా ఎంచుకున్నాడు.. అతడే నేడు తన మధురమైన బాణీలతో యువతను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌. సంగీతం ఓ దివ్య ఔషదం అన్నట్లు.. ఆయన మనసుల్ని గాల్లో తేలేలా చేస్తున్నాడు. గుండెలు పిండి, కన్నీరూ పెట్టిస్తున్నాడు. డ్రమ్మర్‌గా కెరీర్‌ ఆరంభించి.. పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. నవంబరు 16న తమన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

ఎస్​.ఎస్​.తమన్

ఆరేళ్లకే..

తమన్‌ పూర్తి పేరు సాయిశ్రీనివాస్‌ తమన్‌. ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. నెల్లూరు స్వస్థలం. కానీ చెన్నైలో పెరిగాడు. ఆయన తండ్రి అశోక్‌ కుమార్‌ ప్రముఖ దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్ములు వాయించేవాడు. అమ్మ సావిత్రి గాయిని. దీంతో చిన్నతనం నుంచీ ఆయనకు సంగీతంపై మక్కువ పెరిగింది. ఆ స్ఫూర్తితో ఆరేళ్లకే డ్రమ్ములు వాయించడం మొదలుపెట్టాడు.

'అమ్మ, నాన్న వెళ్లే ప్రతి స్టూడియోకు నేను వెళ్లేవాడిని. స్టూడియోలో వాయిద్య కళాకారుల్ని గమనించేవాడిని. ఓ సారి నాన్న ఆయనకు వచ్చిన పారితోషికంతో నా కోసం దక్షిణాఫ్రికా నుంచి డ్రమ్ములు కొని తీసుకొచ్చారు. వాటితో చుట్టుపక్కల జరిగే అమ్మవారి పండుగలు, సంగీత పోటీల్లో డ్రమ్స్‌ వాయించేవాడ్ని' అని ఓసారి తమన్‌ చెప్పాడు.

ఎస్​.ఎస్​.తమన్

తొలి పారితోషికం..

అప్పుడు తమన్‌ వయసు 13 ఏళ్లు. ఆయన మొదటి సినిమా రికార్డింగ్‌ అప్పుడే జరిగింది. మాధవపెద్ది సురేశ్‌.. తమన్‌ను పిలిచి 'భైరవద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా తీసుకున్నాడు. తొలి పారితోషికంగా రూ.30 అందుకున్నాడు. మొదటి సంపాదనను అమ్మకు ఇచ్చేశారట.

'నాకు 13 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. అది కూడా సగంలో ఆగిపోయింది. నాన్న మరణంతో ఒక్కసారిగా జీవితం తారుమారైంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నా జీవితం సంగీతంతో ముడిపడి ఉందని అర్థమైంది. నేను హాబీగా తీసుకున్న పని నాకు అన్నం పెట్టే వృత్తి అవుతుందని అప్పుడే అనిపించింది. నేను స్కూల్‌కు వెళ్తే సంపాదించేది ఎవరు? అమ్మ బయటికి వెళ్లి పనిచేస్తే లోకం ఎలా చూస్తుందో నాకు అప్పుడే అర్థమైంది. అమ్మని ఇంట్లోనే ఉంచి, చెల్లి యామినీని స్కూల్‌లో జాయిన్‌ చేశా. ఎక్కడ రికార్డింగ్స్‌ ఉంటే అక్కడికి వెళ్లిపోయేవాడిని' అని ఓసారి తమన్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదికి ఆయన తండ్రి ఎల్‌ఐసీ డబ్బులొచ్చాయి. వాటితో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పరికరాలు కొని, వాటితో జీవితం సాగించాడు.

శివమణితో ఎస్​.ఎస్​.తమన్

రూ.30 నుంచి రూ.3 వేల వరకు..

తమన్‌ తండ్రి మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయన్ను ప్రోత్సహించారు. వారి సాయంతో అలుపు లేకుండా షోలు చేశాడు. అతి తక్కువ కాలంలో రిథమ్‌ డ్రమ్స్‌ ప్లేయర్‌ అయిపోయాడు. రూ.30తో ప్రారంభమైన ఆయన పారితోషికం రోజుకు రూ.3 వేలకు చేరుకుంది. '1994 నుంచి 1997 వరకు నాకు అతి కష్టమైన రోజులు. ఆ సమయంలో రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రమణ్యం, గంగై అమరన్‌, శివమణిగారు నన్ను ఆదుకున్నారు. వాళ్ల దగ్గరే ఎక్కువ పనిచేశా. నాలుగేళ్లలో దాదాపు 4 వేల స్టేజ్‌ షోలు చేశా. డ్రమ్మర్‌గా నా కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి..' అని తమన్‌ చెప్పారు.

బాయ్స్​ చిత్రంలో ఎస్​.ఎస్​.తమన్

నటన కష్టం..

దర్శకుడు శంకర్‌ వినూత్నంగా ఆలోచించి తీసిన సినిమా 'బాయ్స్‌'. ఈ సినిమాలో కథానాయకుడు సిద్ధార్థ్‌ స్నేహితుడిగా డ్రమ్ములు వాయించే వ్యక్తి కావాలని దాదాపు 200 మందికి తెర పరీక్ష చేశారు. కానీ శంకర్‌కు ఎవరూ నచ్చలేదు. తమన్‌ అప్పటికే డ్రమ్ములు వాయిస్తున్న విధానాన్ని రెహమాన్‌ చెప్పడం వల్ల శంకర్‌ ఆయన్ను తీసుకున్నాడు. దీని తర్వాత తమన్‌కు నటించే అవకాశం వచ్చింది.. కానీ ఆయన తిరస్కరించాడు. 'తెరపై నటించాలంటే చాలా కష్టమండీ బాబూ.. అందుకే 'బాయ్స్‌' తర్వాత మళ్లీ దాని జోలికి వెళ్లలేదు..' అని ఓ సారి తమన్‌ పేర్కొన్నాడు.

ఎస్​.ఎస్​.తమన్

జీవితం మారింది..

మణిశర్మ దగ్గర 'ఒక్కడు' కోసం పనిచేయడం తన జీవితాన్ని మార్చేసిందని తమన్‌ అంటుంటారు. ఆయన వద్ద పనిచేస్తూ ఎనిమిదేళ్లు ఉండిపోయారు. తమన్‌కు 24 ఏళ్లు వచ్చే సరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేశారు. తెలుగు, మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్‌, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో నెంబరు 1 ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో రోజుకు రూ.40 వేలు చార్జ్‌ చేసేవారు.

సంగీత దర్శకుడిగా అవకాశం..

24 ఏళ్ల వయసులో తమన్‌కు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అది తమిళ సినిమా. ఆ తర్వాత రవితేజ 'కిక్‌' సినిమాతో సిక్స్‌ కొట్టారు. ఆ సమయంలో టెన్షన్‌తో 11 కిలోలు తగ్గానని తమన్‌ అంటుంటారు. ఆపై 'బృందావనం', 'రగడ', 'మిరపకాయ్‌', 'దూకుడు', 'బాడీగార్డ్‌', 'బిజినెస్‌మెన్‌', 'బాద్‌షా', 'రేసుగుర్రం', 'సరైనోడు', 'భాగమతి'.. ఇలా అతి తక్కువ కాలంలోనే 72 సినిమాలకు సంగీతం అందించారు. 2018లో వచ్చిన 'అరవింద సమేత' ఆయన వందో సినిమా. ఈ ప్రయాణంలో తమన్‌ ఎన్నో ఫ్లాప్‌లు అందుకున్నారు.. 'అల వైకుంఠపురములో..' లాంటి హిట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 'క్రాక్‌', 'వకీల్‌ సాబ్‌', 'టక్‌ జగదీష్‌' వంటి క్రేజీ ప్రాజెక్టులకు బాణీలు అందిస్తున్నారు.

తన తండ్రితో ఎస్​.ఎస్​.తమన్ చివరి ఫొటో

చివరి ఫొటో..

అక్టోబరు 9 తమన్‌ సోషల్‌మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. 'మిస్‌ యూ నాన్న.. 25 ఏళ్ల క్రితం 1995లో నేను నా ప్రియమైన తండ్రితో తీసుకున్న చివరి ఫొటో. నువ్వు మా వెంటే ఉన్నామని, ఉంటావని నాకు తెలుసు' అని భావోద్వేగానికి గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details