మణికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తెల్లవారితే గురువారం' సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటించారు. ఈ చిత్రానికి ఆయన పెద్ద కుమారుడు కాల భైరవ సంగీతం అందించారు. మార్చి 27న విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కాల భైరవ. అవేంటో చూద్దాం.
వెంటవెంటనే తమ్ముడితో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
చాలా ఆనందంగా ఉంది. నాదీ తమ్ముడిది (శ్రీ సింహా) తొలి చిత్రం ఒకటే అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో అది మరిచిపోలేని అనుభూతి. సింహా నటించిన రెండో చిత్రానికీ (తెల్లవారితే గురువారం) నేను సంగీతం ఇస్తానని ఊహించలేదు. ఇవి రెండు మాత్రమే కాదు సింహా హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమాకీ నేనే మ్యూజిక్ డైరెక్టర్‌ని. ఇదంతా కావాలని చేసింది కాదు. దర్శకనిర్మాతల అభిరుచి మేరకు సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకుంటున్నారంతే.
మీ ఇద్దరి మధ్య చర్చలు జరుగుతుంటాయా?
చిన్నప్పటి నుంచి మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండేవి. ఏదైనా సినిమా చూసినపుడు ఫలానా సన్నివేశం ఇలా తీసుంటే బాగుండేది, ఆ ఫైట్ అలా తెరకెక్కించాల్సింది అని చర్చించుకునేవాళ్లం. మేము పరిశ్రమకు వచ్చాక కూడా అదే కొనసాగిస్తున్నాం. నా సంగీతం గురించి తను, తన నటన గురించి నేను ఫీడ్ బ్యాక్ ఇచ్చిపుచ్చుకుంటాం.
చిత్ర ముందస్తు వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు కదా!
అవును. ఆయన మాట్లాడిన ప్రతిదానికి అర్థం ఉంది. తారక్ అన్నతో అనుబంధం ఇప్పుడు మొదలైంది కాదు. ‘స్టూడెంట్ నెం:1’ చిత్రం నుంచి ఆయన్ను చూస్తున్నాం. మా కుటుంబంతో ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన వేడుకకు వచ్చినందుకు చాలా సంతోషించాం. తారక్ సినిమాకు సంగీతం అందించాలనేది నా కల. అది అనుకున్నంత తేలిక కాదు. అందుకే ఒక్కో సినిమాతో నన్ను నేను నిరూపించుకుంటూ ఎప్పటికైనా కల నెరవేర్చుకుంటాను.
‘మత్తు వదలరా’లో పాటలకు ప్రాధాన్యం లేదు మరి ఇందులో?
‘మత్తు వదలరా’ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. అందులో నేపథ్య సంగీతానికే ప్రాధాన్యం ఉంది కానీ పాటలకు అవకాశం లేదు. ‘తెల్లవారితే’ మంచి ఎంటర్‌టైనర్. ఇందులో మూడు పాటలు అందించాను.
‘మత్తు వదలరా’, ‘కలర్ ఫొటో’ విజయం బాధ్యత పెంచిందా?
ఫలితం ఏదైనా బాధ్యతనేది ఉంటుంది. అయితే క్రెడిట్ అంతా నేనే తీసుకోను. ఒకదానికొకటి సంబంధం లేని స్ర్కిప్టులు నా దగ్గరకు రావడం గొప్ప అవకాశంగా భావిస్తాను.