తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా జీవితం ఆ సినిమాలా ఉంటుంది​: దేవిశ్రీప్రసాద్​ - రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు

Adavallu Meeku Joharlu Devisriprasad: తన జీవితం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలా ఉంటుందని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్​. ఈ చిత్ర దర్శకుడు తిరుమల కిషోర్​ ఎంతో తెలివైనవారని ప్రశంసించారు. ఈ మూవీలోని ఓ పాటను డైరెక్టర్​ సుకుమార్​కు వినిపిస్తే అద్భతంగా ఉందని తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.

adavallu meeku joharlu devi sri prasad
ఆడవాళ్లు మీకు జోహార్లు దేవీశ్రీప్రసాద్​

By

Published : Feb 27, 2022, 6:46 AM IST

Adavallu Meeku Joharlu Devisriprasad:ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు.. దేవిశ్రీప్రసాద్‌. ఆయన బాణీల్లో హుషారు అలాంటిది. ఇటీవల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేశారు. శర్వానంద్‌ కథానాయకుడిగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్‌ చిత్ర విశేషాలను తెలిపారు. ఆ విషయాలివీ...

'ఆడవాళ్ళు మీకు జోహార్లు'... అలా మిమ్మల్ని చెప్పమంటే ఎవరితో మొదలుపెడతారు?
ప్రపంచంలో ఎవరైనా మొదట అమ్మకే జోహార్లు చెబుతారు. మా అమ్మ గురించి అందరికీ తెలిసిందే. మా నాన్న, మేము కెరీర్‌లో విజయవంతం అయ్యామన్నా, మేమంతా సంతోషంగా ఉన్నామన్నా కారణం మా అమ్మే. మా నాన్నకి 32ఏళ్ల వయసులోనే గుండెపోటు వచ్చింది. అప్పట్నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.

ఈ కథ విన్నప్పుడు మీ వ్యక్తిగత జీవితం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా?
ఈ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు తిరుమల కిషోర్‌కి కొన్ని ఫొటోలు పంపించా. నా జీవితం మన సినిమాలాగే ఉంటుందని చెప్పేవాణ్ని. మా ఊరు వెళ్లినప్పుడు పిన్ని, బాబాయ్‌లు, అత్తయ్యలు, మావయ్యలు, అక్కవాళ్లూ, వాళ్ల పిల్లలు, కజిన్స్‌... ఇలా అందరూ చుట్టుముట్టేవారు. వాళ్లందరికీ నేనంటే చాలా ఇష్టం, బాగా ముద్దు చేసేవాళ్లు. ఈ సినిమా అలాగే ఉంటుంది. ఇంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఓ కుర్రాడి జీవితం ఎలా సాగిందనేది చాలా బాగుంటుంది.

దర్శకుడు తిరుమల కిషోర్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పని విషయంలో ఆయనతో మీకున్న సౌలభ్యం ఎలాంటిది?

కథ విషయంలో తిరుమల కిషోర్‌ చాలా స్పష్టతతో ఉంటాడు. సృజనాత్మకత ఉన్న దర్శకుడు. తను ఎక్కడ పాట కావాలనేది చాలా బాగా చెబుతుంటారు. నేను రాసిన ‘మాంగళ్యం తంతునానేనా...’ నేపథ్యం చెప్పినప్పుడు వెంటనే నాకు ట్యూన్‌ వచ్చేసింది. టైటిల్‌ గీతం అనుకున్నప్పుడు దానికి ఫన్‌ జోడిస్తే బాగుంటుందనుకున్నాం, అదే చేశాం. ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమాగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నిలుస్తుందని కచ్చితంగా చెబుతా. మిక్సింగ్‌ సమయంలోనే ఈ సినిమాని మూడుసార్లు చూశా. అంత బాగా నచ్చింది. ‘పుష్ప’ ప్రచారం సమయంలోనే సుకుమార్‌కి ఇందులోని ఓ పాట వినిపించా. సూపర్‌ డార్లింగ్‌... అని అప్పుడే చెప్పేశారు. టైటిల్‌ గీతం వచ్చాకైతే అనిల్‌ రావిపూడి, బాబీ, ప్రభుదేవా... ఇలా చాలా మంది మెచ్చుకున్నారు.

‘పుష్ప’ సంగీతం సరిహద్దులు దాటి విశేష ప్రాచుర్యం పొందింది. దానివెనక కారణాల గురించి చెప్పమంటే?
సుకుమార్‌ సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయి. తనకి ఎప్పట్నుంచో ఆ విషయం చెబుతూ నీ సినిమాలు అన్ని భాషల్లోనూ రావాలనేవాణ్ని. అల్లు అర్జున్‌ను పాన్‌ ఇండియాని వదలకు, తమిళంలోనూ చేయమని చెప్పేవాణ్ని. అలాంటి అవకాశం మా అందరికీ ఈ సినిమాతో కుదిరింది. ఐదు భాషల్లో ఈ పాటలు రావడం, ముఖ్యంగా నాకు హిందీ, తమిళం, తెలుగు భాషలు బాగా వస్తాయి కాబట్టి పాటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. అందుకే ఆయా భాషల్లో ఎక్కడా ఇవి డబ్బింగ్‌ పాటలు అన్నట్టు ఉండవు. ‘పుష్ప’ చేస్తున్నప్పుడే ‘పుష్ప2’ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. ఆ పనులూ మొదలయ్యాయి.

ఇప్పుడు సంగీతం వేగంగా చేరువవుతోంది. సామాజిక మాధ్యమాలు ప్రభావం చూపిస్తున్నాయి. సంగీతానికి ఇది మంచి సమయమే కదా?

సంగీతానిది ఎప్పుడూ గోల్డెన్‌ ఎరానే. వందేళ్లు, యాభయ్యేళ్ల కిందట పాటల్ని మనం పాడుకుంటున్నాం కదా. మరి అప్పట్లో ఏ సామాజిక మాధ్యమాలు ఉండేవి? సంగీతం సామాజిక మాధ్యమాల్ని ప్రభావితం చేస్తుందేమో కానీ, దాని వల్ల సంగీతమమేమీ ప్రభావితం కాదు. ఒక పాటకి లక్షలు, మిలియన్ల వ్యూలు వచ్చాయంటే అదేం నాకు గొప్పగా అనిపించదు. ఆ లెక్కలకి అతీతమైనది సంగీతం. ఎప్పుడూ అలా ఎల్లలు దాటి వెళుతూనే ఉంటుంది.

కొత్త సినిమాల కబుర్లు?

‘ఎఫ్‌3’తోపాటు, బాబీ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి సినిమా కోసం మూడు పాటలు చేశాం. పవన్‌కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చేస్తున్నా. ఓ బాలీవుడ్‌ చిత్రం, వైష్ణవ్‌తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా...’ చేస్తున్నా.

ఇదీ చూడండి:

Adavallu meeku joharlu: 'చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ భావన కలిగింది'

Adavallu meeku joharlu: 'అదే ఈ సినిమాకు స్పెషల్​గా నిలుస్తుంది​'

''ఆడవాళ్లు మీకు జోహార్లు'తో ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం'

ABOUT THE AUTHOR

...view details