తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2019, 3:28 PM IST

ETV Bharat / sitara

భారత్​ భేరి: 'రంగీలా' రాజకీయం ఫలించేనా?

ఉత్తర ముంబయి... భాజపాకు కంచుకోట. 2014లో మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడే ఓటమి పాలయ్యారు అక్కడ. అలాంటి చోట ఏమాత్రం రాజకీయ అనుభవం లేని సినీ నటి ఊర్మిళను రంగంలోకి దింపింది కాంగ్రెస్​. ఇందుకు కారణమేంటి? 2009 'గోవింద' కథ ఏం చెబుతోంది?

ఉత్తర ముంబయిలో ఊర్మిళను దింపుతున్న కాంగ్రెస్​

ఉత్తర ముంబయిలో ఊర్మిళను దింపుతున్న కాంగ్రెస్​
" సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం, ప్రజలు ఆకర్షితులవడం సాధారణం. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. సినీ హీరోలు, హీరోయిన్లకు సమాజంలో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ప్రజలు వాళ్లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వారి ద్వారా రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. 1984లో అలహాబాద్​లో భాజపా దిగ్గజ నేత హేమంత్ నందన్ బహుగుణపై అమితాబ్ బచ్చన్ భారీ మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. "

- శశిధర్ పాఠక్​​, రాజకీయ విశ్లేషకుడు

సినీ గ్లామర్​...! భాజపాకు కంచుకోటైన ఉత్తర ముంబయిలో ఊర్మిళను పోటీకి దింపడం వెనుక కాంగ్రెస్​ కారణం ఇదే.

ఇవీచూడండి:

అప్పుడు ఎంపీ... ఇప్పుడు బీడీ కార్మికుడు

స్టార్టప్​: మోదీ చర్యలు X రాహుల్​ హామీలు

వారికి 'గ్లామర్​' కొత్త కాదు...

ఉత్తర ముంబయిలో ఎప్పటినుంచో భాజపాదే హవా. 1989 నుంచి ఆ పార్టీ నేత రామ్​ నాయక్ వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈ విజయపరంపరకు అడ్డుకట్ట వేసేందుకు 2004లో గ్లామర్ అస్త్రం ప్రయోగించింది కాంగ్రెస్​. రామ్ నాయక్​కు పోటీగా బాలీవుడ్ హీరో గోవిందను బరిలో నిలిపింది. కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. గోవింద ఘన విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో గోవింద పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ నిరుపమ్​ పోటీ చేసి గెలిచారు.

2014కు భాజపా తిరిగి పుంజుకుంది. సంజయ్​పై గోపాల్​ శెట్టి విజయం సాధించారు. ఉత్తర ముంబయి మాత్రమే కాదు మహారాష్ట్రవ్యాప్తంగా చతికిలపడింది కాంగ్రెస్​. 48 లోక్​సభ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కమలదళం ప్రభంజనం సృష్టించింది. భాజపా 23, మిత్రపక్షం 18 స్థానాల్లో గెలిచాయి.

లోక్​సభ ఎన్నికలకు కొద్ది నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​కు నిరాశే మిగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏదే హవా.

పుంజుకునేదెలా...?

మహారాష్ట్రలో ఐదేళ్లుగా వరుస ఓటములతో కాంగ్రెస్​ పునరాలోచనలో పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెట్టింది. రాష్ట్రంలోని ప్రతి సీటు విషయంలో విస్తృత కసరత్తు చేసింది.

ఉత్తర ముంబయిలో భాజపా సిట్టింగ్​ ఎంపీ గోపాల్​ శెట్టిని ఎదుర్కొనేందుకు ప్రజాకర్షణ ఉన్న అభ్యర్థి కోసం వెతికింది కాంగ్రెస్​. ఇటీవలే పార్టీలో చేరిన ఊర్మిళ అందుకు సరైన వ్యక్తని నిర్ణయానికి వచ్చింది. ఆమెకు టికెట్​ ఇచ్చింది.

ముంబయి పరిధిలోని అన్ని లోక్​సభ నియోజకవర్గాలకు ఏప్రిల్​ 29న పోలింగ్​ జరగనుంది. గోవింద తరహాలో ఊర్మిళ విజయం సాధిస్తారా లేదా అన్నది మే 23న తేలనుంది.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి

మోదీ అంతరిక్షంలో ఉండడమే ఉత్తమం'

ABOUT THE AUTHOR

...view details