తన కుటుంబంలోని కథానాయకులు అందరినీ కలిపి ఓ సినిమాని నిర్మించాలనేది డి.రామానాయుడు కల. ఆ చిత్రం కోసం ఆయన కథల్ని కూడా ఆహ్వానించారు. సరైన కథల్లేక ఆ కలయికలో సినిమా కుదరలేదు. 2019లో మామా అల్లుళ్లు వెంకటేశ్ - నాగచైతన్య కలిసి 'వెంకీమామ' చేశారు. కానీ.. కుటుంబ కథానాయకులంతా కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. రామానాయుడు వారసుడు డి.సురేష్‌బాబు కూడా తన కుటుంబ కథానాయకులకు తగ్గ కథ వస్తే సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచి కథ రావడమే ఆలస్యం అని చెబుతుంటారాయన.
వెంకీ, చైతూ, రానా కలయికలో మల్టీస్టారర్! - మల్టీస్టారర్ సినిమా
సీనియర్ నటుడు వెంకటేశ్, హీరో నాగచైతన్య, రానాను ఒకే తెరపై చూపించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు వేగేశ్న సతీష్. ఇందుకోసం ఓ కథ కూడా సిద్ధం చేశారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.
అయితే తాజాగా వెంకటేశ్, రానా, నాగచైతన్యల్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వేగేశ్న సతీష్ ఓ కుటుంబ కథను సిద్ధం చేశారు. కథానాయకులైతే ఇంకా వినలేదు కానీ, ఆ కలయికలో సినిమా గురించి చర్చలైతే ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న 'శతమానం భవతి'తో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు వేగేశ్న సతీష్. ప్రస్తుతం 'కోతి కొమ్మచ్చి' చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక దగ్గుబాటి కుటుంబ కథానాయకుల సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు.
ఇదీ చూడండి: నా యాసపై కామెంట్లు చేసినప్పుడు బాధేసింది: దీపిక