తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మల్టీప్లెక్స్​లో సినిమా ఇకపై సరికొత్తగా - Multiplexes digital life

పేపర్​ లెస్​ టికెట్లు, భౌతిక దూరంతో సీట్లు, మధ్య మధ్యలో విరామాలు, శానిటైజేషన్​, ఉష్ణోగ్రత నమోదు లాంటి నిబంధనలు పక్కాగా పాటించాలని భావిస్తున్నాయి మల్టీప్లెక్స్​ సంస్థలు. ఈ మేరకు నూతన విధి విధానాలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా. అన్​లాక్​-3లో భాగంగా ఆగస్టులో థియేటర్ల పునః ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చని ఆశాభావంతో ఉన్నాయి సదరు యాజమాన్యాలు.

Multiplexes
డిజిటల్​ లైఫ్​లోకి మారుతున్న మల్టీఫ్లెక్స్​లు..

By

Published : Jul 25, 2020, 1:46 PM IST

మునుపటిలా వీకెండ్స్​, మల్టీప్లెక్స్​లు, షాపింగ్​లు లేవు. కరోనా మహమ్మారి దెబ్బకు అన్నీ బంద్​ అయిపోయాయి. వినోదం కోసం ఓటీటీలకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇంకెంత కాలం? డీటీఎస్​ ఎఫెక్టులు, త్రీడీ చిత్రాల కోసం కుటుంబంతో కలిసి హాయిగా థియేటర్లకు వెళ్లే రోజులు మళ్లీ వస్తాయా? ఒకవేళ మల్టీప్లెక్స్​లు ఓపెన్​ చేస్తే.. గతంలోలాగే ప్రజలు ఆదరణ చూపిస్తారా? సినిమా కోసం వెళ్తే వైరస్ ఎక్కడ​ అంటుకుంటుందో అని భయాలున్నాయా? అయితే వాటన్నింటికి సమాధానాలు ఇచ్చింది మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా.

ఆగస్టు నుంచే!

దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్చి నుంచి థియేటర్లు మూసేశారు. ఆనెల 25న లాక్​డౌన్​ విధించిన ప్రభుత్వం.. నెలల వ్యవధి తర్వాత పలు వ్యాపారాలు​, సర్వీసులకు నెమ్మదిగా ఫేజ్​ల రూపంలో అనుమతులు ఇస్తోంది.

జూన్​ 8 నుంచి షాపింగ్​ మాల్స్​ తెరవడానికి ఒప్పుకున్న చెప్పిన కేంద్రం.. వాటిల్లో ఉండే సినిమా హాళ్లు, గేమింగ్​ ఆర్కేడ్లు, ఆట ప్రదేశాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. మహమ్మారి కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్​లు మూత పడటం వల్ల సినీ పరిశ్రమ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని అభిప్రాయపడింది మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా. అన్​లాక్​-3 ప్రక్రియలో భాగంగా కనీసం ఆగస్టు నుంచి అయినా మల్టీప్లెక్స్​లు ఓపెన్​ చేస్తే.. కచ్చితంగా వీక్షకులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

మల్టీప్లెక్స్​ సర్వీసులు పునరుద్ధరిస్తే తీసుకునే జాగ్రత్తలు, పాటించే నిబంధనలతో కొన్ని విధివిధానాలనూ రూపొందించింది మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(మాయ్​). అవేంటంటే..?

  • మల్టీప్లెక్స్​ల్లో ఏ రెండు స్క్రీన్లలోని షోలు ఒకేసారి మొదలుకావు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్​ను రూపొందిస్తారు. సినిమా సినిమాకు మధ్య 15 నిమిషాల నుంచి గంటన్నర వ్యవధి ఉండేలా చూడనున్నారు.
  • షో మధ్య ఖాళీ సమయాన్ని పెంచనున్నారు. ఆ సమయంలో థియేటర్​ను శానిటైజ్​ చేస్తారు.
  • టికెట్​ బుక్​ కాగానే ప్రత్యేకమైన ఆల్​గారిథమ్​ సాయంతో ఆ సీటుకు ఇరువైపులా ఉండే సీట్లు బుకింగ్​ చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇది భౌతిక దూరాన్ని పక్కాగా పాటించేందుకు ఉపయోగపడుతుంది.
  • లాబీ ఏరియా సహా ప్రజలు ఎక్కువగా ముట్టుకునే రెయిలింగ్​లు, డోర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. ఆడియన్స్ శరీర ఉష్ణోగ్రతను చెక్​ చేయడం, తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని నిబంధనలు పెట్టనున్నారు.

స్కాన్​ క్యూఆర్​ కోడ్​

థియేటర్లు, మల్టీప్లెక్స్​లలో ఇకపై పేపర్​ టికెట్లు కనిపించకపోవచ్చు. ఆన్​లైన్​ టికెట్​ బుకింగ్​ సమయంలో ఆల్​-ఇన్​-వన్​ ఎస్​ఎంఎస్​ సిస్టమ్​ ద్వారా కస్టమర్లకు బార్​కోడ్​ లింక్​ను మొబైల్​ ఫోన్లకు సందేశం రూపంలో పంపుతారు. ఎంట్రన్స్​ వద్ద ఆ క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయాల్సి ఉంటుంది. సీటు లొకేషన్​, ఫుడ్​ అండ్​ బేవరేజ్​ మెనూ ఆర్డర్​ కూడా డిజిటల్​గానే చేసుకోవచ్చు.

మెట్రో ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం టికెట్లు ఆన్​లైన్​లో బుక్​ అవుతున్నాయి. నాన్​ మెట్రో సిటీల్లో మాత్రం 40 నుంచి 50 శాతం మాత్రమే అంతర్జాలం సాయంతో టికెట్లు కొంటున్నారు. సగటున 50 శాతం మంది మల్టీప్లెక్స్​ బయట ఉండే బాక్సాఫీస్​ వద్దే టికెట్లు బుక్​ చేసుకుంటున్నారు. కాబట్టి బాక్సాఫీస్​ను​ కూడా పేపర్​లెస్​ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి యాజమాన్యాలు.

ఏవైనా సలహాలు, సూచనలు కోసం టచ్​ స్క్రీన్​ శానిటైజ్డ్​ మెషీన్లను ఇన్​స్టాల్​ చేయనున్నారు. వీటి వల్ల సిబ్బంది మీద ఆధారపడటం తగ్గుతుంది.

12 వేల కోట్ల వ్యాపారం

తెలుగు, హిందీ, తమిళం​లో పెద్ద హీరోల చిత్రాలు విడుదలైతే ప్రేక్షకులు కచ్చితంగా వస్తారని మల్టీప్లెక్స్​ యాజమాన్యాలు భావిస్తున్నాయి. సూర్యవంశీ, రాధే, 83 వంటి చిత్రాలు కచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తాయని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలకు కొంతమంది మొగ్గుచూపినా.. థియేటర్లలో సినిమా చూడటం మన డీఎన్​ఏలో ఉందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అది సోషల్​ ఎక్స్​పీరియన్స్​ అంటున్నారు. సినిమా థియేటర్ల వల్ల ప్రతి ఏడాది దాదాపు 12 వేల కోట్ల వ్యాపారం​ జరుగుతుందని.. ప్రస్తుతం నెలకు వందకోట్ల రూపాయల మేర నష్టాలు ఎదుర్కొంటున్నట్లు స్ఫష్టం చేశారు మల్టీఫ్లెక్స్ నిర్వహకులు.

80 శాతం తెరుస్తాం​

ఒక్కసారి మల్టీప్లెక్స్​ ఓపెన్​ చేసుకునేందుకు అనుమతి​ ఇస్తే.. దాదాపు 80 శాతం స్క్రీన్లు రన్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్​కు.. తమ విధివిధానాలతో కూడిన లేఖను జులై 9న అందించినట్లు చెప్పారు సంఘం ప్రతినిధులు. ఆ తర్వాతి రోజునే ప్రధాని కార్యాలయం సహా ఆర్థిక మంత్రిత్వశాఖ, ఐటీ శాఖకు కూడా ఆ లేఖ పంపినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details