ముళ్లపూడి వెంకట రమణ గురించి చెప్పాలంటే మూడు 'గొప్ప'లను చెప్పుకోవాలి. గొప్ప రచయిత, గొప్ప చిత్ర నిర్మాత, గొప్ప వ్యక్తి! ఆ శైలి ఎవరికి రాదు. ఎవరైనా ఆయన శైలిని అనుకరించాల్సిందే గాని, ముళ్లపూడి ఎవరినీ అనుకరించలేదు. కథ రాసినా, ఆత్మకథ రాసినా, నాలుగు వాక్యాలు రాసినా, సినిమా వార్తలు రాసినా, సినిమా సమీక్షలు రాసినా, సినిమా సంభాషణలు రాసినా - ఏది రాసినా ఆయన శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది అనితర సాధ్యం. ఆయనకి గురువులెవరూ లేరు. అంతా స్వానుభవమే, సృయంకృషే. ఈరోజు రమణ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోనే విశేషాలు రావి కొండలరావు మాటల్లో.
"1948 'బాల' పత్రికలో సీరయల్ కథ రాశారు రమణ. బాపు అప్పుడు ఆ సీరియల్‌కి బొమ్మలు వేశారో లేదోగాని, విడిగా 'బాల'లో కార్టూన్‌లు వేసేవారు. నేనూ అందులో ఏదో రాస్తూ ఉండేవాడిని. అప్పుడే వాళ్లంటే అభిమానం ఏర్పడింది. ఆ సంవత్సరంలోనే మద్రాసు వెళ్లినప్పుడు, 'బాల' ఆఫీసులో బాపు చిరునామా అడిగి, ఆయన ఇంటికి వెళ్తే ఇద్దరూ కలిశారు. అందరమూ నిక్కర్లతో ఉన్నవాళ్లమే. అదీ పరిచయం.
తర్వాతే లేఖలు... 1953-54 సంవత్సరాల్లో బాలకృష్ణా రోడ్డులో ఉన్న మేడమీద గదుల్లోని ఒక గదిలో రమణ, అజంతా ఉండేవారు. ఒక చిన్న గదిలో నేను ఉండేవాడ్ని. ఏదో డబ్బింగ్ సినిమాకు డైలాగులు కాపీ చేస్తూ కనిపించేవారు రమణ. నేనేదో నా ప్రయత్నాలు చేస్తుండేవాడిని. సిగరెట్లు కాలుస్తూ రెండో ఆట సినిమాలకి నడిచివెళ్లి, నడిచివచ్చేవాళ్లం. అనవసరపు మాట, వృథా ప్రసంగం ఏదీ ఉండేది కాదు. ఆయన ఆలోచనలు మాత్రం ఆలోచించదగ్గవిగా ఉండేవి. 'టీ తాగుదామా' అని అడిగితే - 'నా దగ్గర అణాయే మిగిలింది, మీరు తాగండి' అని అణా ఇచ్చి టీ తాగించిన ఔదార్యం అప్పట్నుంచే ఉంది. ఎప్పటికీ తగ్గలేదు సరికదా, పెరుగుతూ వచ్చింది.
ఆఫీసు నుంచి ఇంటికి: 1956లో 'ఆనందవాణి'లో నాకు ఉద్యోగం వచ్చింది. వాళ్ల ఆఫీసులోనే మకాం. పక్కనే ఆంధ్రపత్రిక ఆఫీసు. రమణ ఆంధ్రపత్రిక విక్లీలో ఉద్యోగం. అప్పటికే ఆయన 'బోల్డు' కథలు రాయకపోయినా, రాసినవి ముత్యాలు, రత్నాలూ. నా కథలు రెండు మూడు వీక్లీలో అచ్చుపడ్డాయి. ఉద్యోగంలో చేరిన మర్నాడే పత్రిక ఆఫీసుకు వెళ్లి రమణనీ, ఆయన ద్వారా నండూరి రామమోహనరావునీ (వీక్లీ ఇన్‌చార్జ్) కలిశాను. నా విషయం చెప్పాను. ఇద్దరం కిందికి దిగి కాఫీ తాగాం. నేను డబ్బులు తీస్తూ 'నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వలగలను' అంటే "నేను ఇంకా ఇవ్వగలను" అని రమణే ఇచ్చేశారు.
నాతోపాటు 'ఆనందవాణి'కి వచ్చి 'ఎక్కడ మీరుండడం?' అని అడిగారు. ఆఫీసులోనే ఒక మూలునున్న పెట్టెబేడా చూపించాను. "ఏడిసినట్టుంది. ఎలా ఉంటారు? మా ఇంటికి వచ్చేయండి. మా అమ్మా వాళ్లెవరూ లేరు. ప్రస్తుతం, నేను మా తమ్ముడే ఉంటున్నాం. వాళ్లూ వచ్చాక చూసుకుందాం పదండి' అన్నారు. ఓడియన్ టాకీస్ పక్క వీధిలో ఉండేవారు రమణ. నా మకాం అక్కడికి మారింది. తమ్ముడు రామచంద్రుడు కూడా అలాంటివాడే. "ఈ పూట భోజనానికి హోటల్‌కి వెళ్లకండి. అన్నం వండేశాను" అనేవాడాయన. ఏ రాత్రికో రమణ వచ్చేవారు. కథలు, రచనలు, సినిమా చర్చలు జరిగేవి. నన్ను ప్రెస్ క్లబ్‌కి తీసుకెళ్లారు ఒకసారి. అక్కడ శ్రీశ్రీ ఉన్నారు. నన్ను పరిచయం చేశారు. "ఇంకో కాళిదాసు బాధితుడన్నమాట" అన్నారు శ్రీశ్రీ. 'ఆనందవాణి' అధిపతి కాళిదాసు. శ్రీశ్రీ కొంత కాలం అక్కడ పనిచేశారు. అదీ వ్యాఖ్యానం.
అదీ ఔదార్యం
రమణ చేతికి గడియారం కట్టుకున్నట్టు ఎన్నడూ చూడలేదు. బహుశా కట్టుకుంటే చేతికి కట్టుబడదేమో?.. చేతికి ఎముక లేదు గనక. ఒకసారి హోటలుకెళ్లి బయటకొస్తున్నపుడు హోటల్ వాడిచ్చిన చిల్లర చేతినిండా ఉంది. ఓ బిచ్చగాడు చెయ్యజాస్తే మొత్తం అంతా వాడి చేతిలోకి వేసేశారు. "ఇంకా ఉన్నారు అందరికీ సర్దవచ్చుగదా" అన్నాను. "ఎవడికీ ఏమీరాదు ఒకడైనా ఓ పూట అన్నం తింటాడు కదా" అన్నారు. (అప్పుడు 8 అణాలు, లేదా పది అణాలు).
పెంచిన పారితోషికం
ఆ ఔదార్యం ఆయన చిత్ర నిర్మాత అయినప్పుడు కూడా అలాగే ఉంది. ఏ నిర్మాత అయినా 'పారితోషికం ఎంత తీసుకుంటారు?' అని అడిగితే, మనం చెప్పినప్పుడు "అమ్మో-అంత ఇవ్వలేను" అని బేరం ఆడి తగ్గించడం ఆనవాయితీ. 'అందాల రాముడు' సినిమా ముందు "ఎలా ఉంది మీ రేటు?" అని అడిగారు నిర్మాత రమణ.
"ఐదువేలూ..అలా ఉంది" అన్నాను. "అబ్బేబ్బే...అదేంటి? పెరగాలి. సాక్షి రంగారావు ఇంకా తక్కిన వాళ్లూ అందరికీ కాస్త పెంచే ఇస్తాను. పెద్దవాళ్లందరికీ ఎలాగూ అడిగింది ఇచ్చేస్తాం. మీలాంటి వాళ్ల దగ్గరే బేరాలు. ఆరువేలు రాస్తాను. అవి తీసుకొని తర్వాత వాళ్లకీ ఎంత డబ్బో చెప్పండి" అన్నారు ఆ నిర్మాత.