తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటులకు కొదవేలేదు. ఎంతోమంది నటులు తమ హాస్య గుళికలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. అయితే, వారిలో కొంతమంది కమెడియన్లు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ సినీ ప్రియుల హృదయాల్లో మాత్రం వారికి ప్రత్యేక స్థానం ఉంది. అలా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వారిలో ఎం.ఎస్. నారాయణ ఒకరు.
పశువుల కాపర్లకు నాటకం నేర్పిన నటుడు!
తెలుగు సినీరంగంలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎంఎస్ నారాయణ. అయితే.. ఆయన పశువులు కాసే కుర్రాళ్లకు నటనను నేర్పించినట్లు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.
కాగా, ఒకానొక సమయంలో ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.ఎస్.నారాయణ తన బాల్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు. "16 ఏళ్లు ఉన్నప్పుడు 'వీధిలో దొరలు' అనే నాటికను రచించా. రచించడమే కాకుండా పశువులు కాసే కుర్రాళ్లందరికీ నటించి చూపించా. వాళ్లకి కూడా నేర్పించా. ఎందుకంటే, అప్పట్లో నేను కూడా పశువులు కాసేవాడిని. ఆ తర్వాత దాన్ని స్టేజ్‌పై కూడా ప్రదర్శించా. ఆ సమయంలో ముఖానికి ఉన్న మేకప్ చూసి అమ్మానాన్న ఎక్కడ తిడతారో అని భయపడి చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్లా. అమ్మ వాళ్లు నిద్రించిన తర్వాత ఇంట్లోకి వెళ్లి దొంగచాటుగా భోజనం చేసి నిద్రపోయా. ముఖానికి మేకప్ మాత్రం అలాగే ఉంచా. అయితే, తెల్లవారేసరికి నా ముఖానికి ఉన్న మేకప్ దుప్పటికి అంటింది. దాంతో మా నాన్న నన్ను కొట్టారు. కానీ, ఆ కళామ్మతల్లే నన్ను ఇలా కరుణిస్తుందని.. ఒక హాస్యనటుడిగా నన్ను మీ ఎదుట నిలబెడుతుందని నేను అనుకోలేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి:నవ్వుల నారాయణుడి గిలిగింతలు