సరిగ్గా నాలుగేళ్ల క్రితం. 2016 సెప్టెంబరు 30. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్.. 'ధోని: ఏ అన్టోల్డ్ స్టోరీ' విడుదల. -ఆ ఏముంది! ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. అతడి గురించి మాకు తెలియదా ఏంటి? అని అనుకుంటూనే థియేటర్లోకి మహీ అభిమానులు అడుగుపెట్టారు. కొన్ని నిమిషాలకే సినిమాలో లీనమైపోయారు. మేం చూస్తుంది ధోనీనే కదా అని చాలా సన్నివేశాల్లో భ్రమపడ్డారు. ఈ క్రమంలోనే ధోనీ ధోనీ అంటూ అరిచి గోలచేసి, థియేటర్ను క్రికెట్ స్టేడియాలుగా మార్చేశారు. ఎన్ని అంశాలు ఉన్నా సరే ఇంతలా ఆ చిత్రం ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం టైటిల్ రోల్ పోషించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్.
150 రోజుల కఠోర శిక్షణ
తను ఓ సాధారణ నటుడైనా సరే, పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. దాదాపు 150 రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీసు చేశాడు. ఈ సమయంలోనే గాయలు కూడా అయ్యాయి. అయినా సరే ఎక్కడా తగ్గకుండా ధోనీ హవభావాల్ని, చిన్న చిన్న కదలికల్ని కూడా పట్టేశాడు. అటు సినిమా, ఇటు క్రికెట్ వీక్షకుల చేత ఒకేసారి శెభాష్ అనిపించుకున్నాడు.