బాలీవుడ్లో బయోపిక్ అంటే మనకు 'ధోని' సినిమా టక్కున గుర్తొస్తుంది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణతో పాటు కలెక్షన్లూ సాధించిన ఈ చిత్రం తీసేందుకు ధోనీ.. రూ.45 కోట్లు తీసుకున్నారట. అవును మీరు విన్నది నిజమే. తన జీవితానికి సంబంధించిన రహస్య, కీలక సమాచారాన్ని ఇవ్వాలంటే ఆ మాత్రం ఇవ్వాలని మహీ భావించినట్లు ఉన్నాడు! ఇదే కాకుండా హిందీలోని పలు బయోపిక్‌ల కోసం పలువురు ప్రముఖులు ఎంతెంత మొత్తం తీసుకున్నారు అనే విషయాలు సమాహారమే ఈ ప్రత్యేక కథనం.
1. ధోనీ (ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ)
బాలీవుడ్లో తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' బయోపిక్ అందరి ప్రశంసలు అందుకుంది. ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతంగా నటించారు. నటిస్తుంది సుశాంత్ లేదా ధోనీనా అనేంతలా జీవించాడు.
ఈ బయోపిక్‌లో చిన్ననాటి నుంచి ధోని.. క్రికెట్‌పై చూపించే ఆసక్తి, ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమ్ఇండియాలో ఏ విధంగా చోటు సంపాదించుకున్నాడనేది చూపించారు. ధోనీ వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్ కెరీర్ గురించి స్పష్టంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. తన బయోపిక్‌ను నిర్మించడానికి చిత్రబృందం నుంచి ధోని రూ.45 కోట్లను తీసుకున్నాడని ఓ సర్వే తెలిపింది. కానీ ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు!
2. సంజయ్ దత్ (సంజు)
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'సంజు'. సంజయ్ దత్ పాత్ర పోషించిన రణ్‌బీర్ కపూర్‌కు విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. సంజయ్ దత్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవరోధాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ విజయం సాధించారు. అయితే ఈ బయోపిక్ కోసం తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నందుకుగానూ సంజయ్ దత్ రూ.9 నుంచి 10 కోట్లను తీసుకున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనితో పాటు బాక్సాఫీస్ వద్ద వచ్చిన లాభంలో భాగం కూడా తీసుకున్నాడని స్పష్టం చేసింది.
3. మేరీ కోమ్ (మేరీకోమ్)
భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'మేరీకోమ్'. 2008లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచేంత వరకు ఆమె ఏ విధంగా కష్టపడిందనే విషయాన్ని వెండితెరపై దర్శకుడు ఓమంగ్ కుమార్ చక్కగా చూపించారు. ఇందులో ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ చేసింది. తన బయోపిక్ అనుమతి కోసం మేరీకోమ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు ఓ సర్వే తెలిపింది. ఈ సినిమాకు ఉత్తమ ఆదరణ పొందిన సినిమా విభాగంలో జాతీయ అవార్డు దక్కింది.