ఏవైనా కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. నటుల కాంబినేషనో, నిర్మాణ సంస్థ గొప్పతనమో, ఆ చిత్ర దర్శకుల ట్రాక్ రికార్డో.. ఆసక్తి కలిగించే అంశం ఏదైనా అంచనాలు మాత్రం పెంచేసుకుంటాం. దీంతో పాటు ట్రైలర్ కట్స్, టీజర్ స్నీక్‌పీక్స్, లిరికల్ ప్రోమోలంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోతుంది. ఇన్ని అంచనాల మధ్య సగటు ప్రేక్షకుడు థియేటర్‌లోనో, ఓటీటీ ద్వారానో సినిమా చూస్తున్నపుడు కథా, కథనాలు చప్పగా అనిపిస్తే ఉస్సురూమంటారు. మరి ఈ ఏడాది విడుదలకు ముందు అంచనాలు పెంచి వాటిని అందుకోలేకపోయిన సినిమాలేంటో చూద్దామా..
రవితేజ స్థాయిని అందుకోలేని.. 'డిస్కోరాజా'..!
మాస్ మహారాజా రవితేజ తన ఎనర్జిటిక్ స్క్రీన్‌షోతో అలరించేందుకు ఈ ఏడాది ఆరంభంలోనే 'డిస్కోరాజా' అంటూ థియేటర్లలో సందడి చేశారు. 'ఒక్క క్షణం' అంటూ సస్పెన్స్ థ్రిల్లర్‌తో హిట్టు కొట్టిన వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా నటించారు. జెనిటిక్ సైన్స్‌తో ముడిపెట్టి అల్లుకున్న కథతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించే రెట్రో లుక్ సీన్లు అలరించినా సినిమాను మాత్రం కాపాడలేకపోయాయి. రవితేజ ఎనర్జీ మాత్రమే ప్రేక్షకుల్లో కొద్దిగా జోష్ నింపింది. అయితే ఈ సినిమాకు తమన్ అందించిన పాటల ఆల్బమ్ మాత్రం సంగీత ప్రియులను 'ఫ్రీక్ అవుట్' చేసింది.
వరల్డ్ ఫేమస్ లవర్
యాంగ్రీ లవర్‌గా, రస్టిక్ లుక్‌తో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం కల్ట్ క్లాసిక్‌లా నిలిచిపోయింది. కానీ, మళ్లీ అదే లుక్‌తో ఎమోషనల్ లవ్‌డ్రామాగా తెరకెక్కిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఒక భావోక్తమైన ప్రేమ కోణాన్ని కథా వస్తువుగా తీసుకుని 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' అంటూ కొన్నేళ్ల క్రితం సినీ ప్రియుల మన్ననలు పొందిన దర్శకుడు క్రాంతి మాధవేనా ఈ చిత్రాన్ని తెరకెక్కించిందంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఒక యువ రచయితగా, ప్రేమికుడిగా విజయ్ నటన మళ్లీ అర్జున్‌రెడ్డిని తలపించడం వల్ల ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. గోపి సుందర్ సంగీతం కూడా పేలవంగా అనిపించింది. సినిమాలో ఎంతో కొంత అలరించిందంటే మాత్రం సింగరేణి బ్యాక్‌డ్యాప్‌లో భార్యభర్తలుగా ఐశ్వర్యా రాజేష్, విజయ్ నటన మాత్రమే.
అక్కడి మేజిక్ ఇక్కడ రిపీట్ కాలేకపోయింది!
కోలీవుడ్‌లో విశేషంగా అలరించిన చిత్రం '96'. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో మాతృకకు దర్శకత్వం వహించిన సి.ప్రేమ్‌కుమారే తెలుగులోనూ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. సోషల్‌మీడియా ప్రభంజనంతో తమిళ '96' చిత్రం యువత గుండెల్లోకి బలంగా చేరిపోయింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిషల మధ్య కెమెస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. శర్వా, సమంతల నటనాచాతుర్యం మనకు తెలిసిందే.. అయినప్పటికీ రామ్, జానుగా సేతుపతి, త్రిషలే ప్రేక్షకులకు గుర్తుండిపోవడం వల్ల తెలుగు రీమేక్ అంతగా రీచ్ కాలేకపోయింది. అయితే పాటలు మాత్రం సంగీత ప్రియులను కట్టిపడేశాయి. '96' చిత్రానికి బాణీలు అందించిన గోవింద్ వసంతనే జానుకు కూడా సంగీతమందించారు.