అగ్ర కథానాయకుల్లో చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్'తోపాటు పవన్‌కల్యాణ్ - రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్.. ఈ మూడూ ముగ్గుల పండక్కి బెర్తులు ఖాయం చేశాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రెండో దశ కరోనా మొదలు కాక ముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్‌కల్యాణ్ 'హరి హర వీరమల్లు', మరొకటి 'సర్కారు వారి పాట'. కరోనా తర్వాత కొత్త చిత్రాలు తెరపైకొచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' స్థానంలో, పవన్‌కల్యాణ్ కొత్త చిత్రం 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ జనవరి 12న రానుంది.. మహేష్ 'సర్కారు వారి పాట' ముందు చెప్పినట్టుగానే పండగ కోసమే ముస్తాబవుతుండగా, 'రాధేశ్యామ్' అనూహ్యంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేసింది. దాంతో సంక్రాంతి బరి మరింత రసవత్తరంగా మారింది.
వసూళ్లు సాధించాలంటే..
కొన్నేళ్లుగా అగ్ర తారల సినిమాల నిర్మాణ వ్యయం భారీ స్థాయిలో ఉంటోంది. రూ.వందల కోట్ల వ్యయంతో రూపొందుతున్నాయి. 'రాధేశ్యామ్' పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ మల్టీస్టారర్ చిత్రం. 'సర్కారు వారి పాట' కూడా భారీ హంగులతో రూపుదిద్దుకొంటోంది. ఇలాంటి మూడు చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తాయంటే బాక్సాఫీసు కళకళలాడటం ఖాయం. కానీ థియేటర్ల సర్దుబాటు ఎలా? అనేదే ప్రశ్న. అగ్ర తారల చిత్రాలు మంచి ప్రారంభ వసూళ్లు సాధించాలంటే సోలోగా విడుదల కావల్సిందే అని, పండగ రోజుల్లో అయితే రెండు సినిమాలైనా ఫర్వాలేదనేది సినీ వ్యాపార వర్గాల మాట. కానీ ఇప్పటివరకు లెక్క ప్రకారం ఇక్కడ ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకైతే 'రాధేశ్యామ్' చిత్రీకరణ మాత్రమే పూర్తయింది. మిగిలినవన్నీ సెట్స్‌పైనే ఉన్నాయి.
కొన్నాళ్లుగా 'విడుదల తేదీలు ప్రకటించడం కోసమే' అన్నట్టుగా మారింది వరస. అప్పటి పరిస్థితుల మేరకు చిత్రబృందాలు హడావుడిగా విడుదల తేదీల్ని ప్రకటించేస్తున్నాయి. తీరా విడుదల సమయానికి ఇంకా పూర్తి కాలేదని వాయిదా వేస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఏళ్లపాటు సెట్స్‌పైనే మగ్గుతున్న సినిమాలు చాలానే. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. మరి ఈ సంక్రాంతి సినిమాల జాబితా ఇలాగే ఉంటుందా, లేక మార్పులు చేర్పులుంటాయా అనేది చూడాలి.