లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ఈ మాటల మధ్య నిత్యం సందడిగా గడుపుతుంటారు సినీ తారలు. కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి. విరామం దొరికింది కదా అని కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లు కొంతమందైతే.. ఇష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నవాళ్లు మరికొందరు.
అనుకోకుండా దొరికిన విరామమైనా పక్కాగా ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారంతా. అయితే కొందరు మాత్రం విరామంలోనూ విశ్రమించడం లేదు. సినిమాకు సంబంధించిన పనులపైనే దృష్టిపెట్టి, బిజీగా గడుపుతున్నారు. వాళ్లు ఎవరో, ఏం చేస్తున్నారో ఓసారి చూద్దామా!
లుక్కు కోసం కసరత్తులు
ఈనెల 13నే అల్లు అర్జున్ కొత్త చిత్రం కోసం కెమెరా ముందుకెళ్లాల్సింది. కరోనావల్ల చిత్రీకరణ వాయిదా పడింది. దర్శకుడు సుకుమార్ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్. అయితే అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని అతడు సినిమా కోసమే వినియోగిస్తున్నాడు. అటవీ నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో అల్లు అర్జున్ భిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నాడట.
అందుకోసం ఇప్పటికే గడ్డం పెంచేశాడు. తన లుక్ తెరపై మరింత పక్కాగా ఉండాలనేది అల్లు అర్జున్ ఆలోచన. అందుకోసం రోజూ లుక్ టెస్టుల్లో పాల్గొంటూ సరిచూసుకుంటున్నాడు. అలాగే చిత్తూరు యాసలో పట్టు పెంచుకుంటున్నాడు. ఇప్పటికే ఒక బృందం అతడికి యాస విషయంలో మెలకువలు నేర్పింది. వేగంగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట. అందుకే ముందే తన బృందాన్ని పక్కాగా సన్నద్ధం చేస్తున్నాడట.
జిమ్‌లో ఫైటర్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ముంబయిలో ఒక దఫా చిత్రీకరణను పూర్తి చేశారు. 'ఫైటర్' అనే పేరు ప్రచారంలో ఉంది. ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి విజయ్ దేవరకొండ ఇందులో మరింత ఫిట్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం సిక్స్‌ప్యాక్ దేహాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ విరామంలోనూ ఈ చిత్రం కోసం అతడు జిమ్‌లో మరిన్ని కసరత్తులు చేస్తున్నాడు. విజయ్‌కు రౌడీ పేరుతో ఓ బ్రాండ్ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నాడట.