టాలీవుడ్లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రెండేళ్లకోసారి జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections) అధ్యక్ష ఎన్నికలు ఈ సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్ పదవీ కాలం ముగియగా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో తాత్కాలికంగానే ఇన్నిరోజులు నరేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై సినీ పెద్దలు దృష్టి సారించారు.
ఈసారి రసవత్తరం!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj)ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మెగాస్టార్ మద్దతుతో ప్రకాశ్‌రాజ్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా మరోసారి మా అధ్యక్ష పీఠం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా మధ్య పోటీ ఉంటుందనుకున్న క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా మా ఎన్నికలపై కన్నేశారు. తమ కుమారుడు, నటుడు మంచు విష్ణు(Manchu Vishnu)ను బరిలోకి దింపారు.
పెద్దల ఆశీర్వాదంతో..
ఎన్నికలకు రెండు నెలల ముందుగానే ప్రచారం మొదలుపెట్టిన మంచు విష్ణు.. కృష్ణ, కృష్ణంరాజు లాంటి సీనియర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వయంగా మోహన్ బాబు కుమారుడ్ని వెంట పెట్టుకొని సీనియర్ల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరడం 'మా' ఎన్నికలపై పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవికి తెలుగు సినీ పరిశ్రమలో త్రిముఖ పోరు నెలకొంది.
అయితే ఈ పోరు ఇద్దరు మిత్రుల మధ్య జరగబోతుంది. చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తన కార్యాచరణ ఏమిటో మంచు విష్ణు సినీ ప్రముఖులకు లేఖలు రాస్తున్నాడు. రేపు మా ఎన్నికలపై అధికారికంగా మంచు విష్ణు ప్రకటన విడుదల చేయనున్నాడు.