తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మ కోసం అక్షరాలే అలంకారాలైతే!

అమ్మ ప్రేమను వివరించడానికి లోకంలో ఏ భాష సరిపోదు. అదే విధంగా ప్రతి మనిషి తన జీవితంలో అమ్మ ప్రాధాన్యాన్ని సరిపోల్చనూ లేరు. అమ్మ అంటేనే కమ్మదనం. ఆ కమ్మదనాన్ని మన తెలుగు పదాలతో రంగరించి ఎన్నో పాటలను అందించారు మన టాలీవుడ్​ గేయ రచయితలు. కానీ, అమ్మ గురించి చెప్పడానికి ఏ పాట, ఏ భావం సరిపోదు.

mother's day tollywood special
అమ్మ కోసం అక్షరాలే అలంకారాలైతే!

By

Published : May 9, 2021, 6:46 AM IST

అమ్మా.. దెబ్బతగిలిందే!

అమ్మా.. కడుపు నొప్పే!

అమ్మా.. జ్వరంగా ఉందే!

అమ్మా.. కరోనా అని భయమే!

బాధొచ్చినా, భయమొచ్చినా ఆమె పేరే మన జపం ఎందుకవుతుంది?

ఎందుకంటే.. అమ్మ అనే పిలుపే సాంత్వన. అమ్మే వైద్యం, చికిత్స. "పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా.." అంటారు 'నాని' కోసం రచయిత చంద్రబోస్‌. మనలోని ప్రాణం, మనదైన రూపం, నడిపించే దీపం, కనిపించే దేవతంటారాయన. అందుకే కష్టమొస్తే ఆ దేవతనే కదా తలచుకొనేది!

రే.. టైం అయింది తినూ!

రే..లేటైంది పడుకో!

ఒసేయ్​.. మందులేసుకున్నావా?

అన్ని పనులు పెట్టుకోకు అలసిపోతావ్‌!

మన గురించి ఇన్ని జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు?

అమ్మ కాక ఇంకెవరు? ఆమె ఇంట్లో లేకపోతే మనల్ని ఇవన్నీ ఎవరడుగుతారు?

అందుకే "అమ్మా అని కొత్తగా మళ్లీ పిలవాలనీ.." అంటారు 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'లో అమ్మ కోసం తపించే బిడ్డల తరఫున వనమాలి. "నింగి నేల నిలిచే దాకా తోడుగా.. వీచే గాలి, వెలిగే తారల సాక్షిగా నవ్వు కావాలే అమ్మా.. నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా" అని వాళ్లలాగే అమ్మను మనమూ బుజ్జగించాలి మరి!

అమ్మా.. నా బ్రష్‌ ఎక్కడా?

అమ్మా.. టిఫిన్‌ ఏదీ?

అమ్మా.. నా ఫోన్‌ ఛార్జర్‌ లేదే!

అమ్మా.. కొంచెం కాఫీ ఇస్తావా?

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటూ.. అమ్మకు ఎన్ని ప్రశ్నలేస్తున్నాం? ఎన్ని పనులు చెబుతున్నాం?

"తరగని బరువైన వరమనే అనుకుంటూ.. తనువున మోశావే అమ్మా" అంటాడు రామజోగయ్య శాస్త్రి.. 'కేజీఎఫ్‌' రాఖీ భాయ్‌ రూపంలో. రోజురోజుకు మోసే బరువు పెరుగుతున్నా.. వరమనే భావిస్తుంటుంది అమ్మ. ఆ ప్రేమను మరింత విరివిగా పంచుతుంది. అందుకే మనం ఎన్ని పనులు చెప్పినా.. భారమని ఏనాడు తలంచదు మాతృమూర్తి. నవ్వుతూ మనకు చేసి పెడుతూనే ఉంటుంది. అదే పాటలో "ఈ జన్మంతా అమ్మా నీకు రుణపడిపోయింది" అంటాడు. మరి మనమూ ఆ రుణం కొంతైనా తీర్చుకుందామా?

కోట్ల రూపాయల డబ్బులుంటాయి

వందల ఎకరాల భూములుంటాయి

ఎత్తైన బంగ్లాలుంటాయి..

విశాలమైన ఆవరణలుంటాయి..

ఎన్ని ఉన్నా.. వాటన్నింటిలో అమ్మ తోడుగా లేదనుకో తట్టుకోగలమా!

అందుకే.. "కోట్ల సంపదే అందించినా.. నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగలనే మించునా.. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా" అంటాడు కోటీశ్వరుడైన 'బిచ్చగాడు' కోసం రచయిత భాషాశ్రీ. మనం ఎంత ఎదిగినా.. అమ్మ ఒడిలో ఆనందం మరెక్కడా దొరకదని గుర్తించాలి.

అమ్మ.. కాసేపు కనిపించకపోతే!

అమ్మ.. ఎక్కడికైనా ప్రయాణమైతే!

అమ్మ.. దూరమైతే..!

అమ్మ.. శాశ్వతంగా లేకపోతే!

ఏ బిడ్డా తట్టుకోలేడు. నువ్వు వెళ్లకమ్మా.. అని మారాం చేస్తాడు. "అమ్మా.. అమ్మా.. నే పసి వాడ్నిమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా!" అని 'రఘువరన్‌ బీటెక్‌'లా కన్నీళ్లు కురిపిస్తాడు రామజోగయ్య శాస్త్రి. అప్పుడు అమ్మ "అడుగై నీతోనే నడిచొస్తున్నా.. అద్దంలో నువ్వై కనిపిస్తున్నా" అని పాడుతూ నిత్యం నీ వెంటే ఉన్నారా.. అని భరోసా ఇస్తుంది. అమ్మ దూరంగా ఉన్నా.. ఆమె మనసు మన చుట్టూనే ఉంటుంది. మనల్ని చుట్టుకొనే ఉంటుంది.

ఇలా.. అడుగడుగునా.. అమ్మ ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను, ప్రాధాన్యాన్ని, దైవత్వాన్ని రంగరించి రాశారు మన సినీ రచయితలు. ఎన్ని రాసినా అమ్మ ప్రేమను వర్ణించడానికి ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. అమ్మను స్మరించడానికి అక్షరాలు అలంకారమవుతూనే ఉంటాయి.

ఇదీ చూడండి:విజయ్ దేవరకొండ: చిన్న పాత్రల నుంచి స్టార్ హీరో వరకు

ABOUT THE AUTHOR

...view details