రీమేక్‌లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు! మంచి కథ, కథనం ఉంటే ఆ సినిమాను వేరే భాషల్లోనూ తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇందులోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన విధంగా కథలో మార్పులు చేయాలి. లేదా అగ్రహీరో అయితే అతడికి తగ్గట్లుగా కథనం మార్చాలి. ఇన్ని సవాళ్ల నడుమ కొందరు హీరోలు రీమేక్లవైపే ఎక్కువగా దృష్టిసారించిన వారూ ఉన్నారు. విక్టరీ వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ కూడా అరువు తెచ్చుకున్న కథల్లో నటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఎక్కువ రీమేక్‌లు చేసిన హీరోలు ఎవరో చూద్దాం.
వెంకటేశ్
తన కెరీర్లో కుటుంబ కథా చిత్రాలతో పాటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఎక్కువగా రీమేక్‌లపైనే దృష్టిపెట్టారు. ఇందులో ముఖ్యంగా 'టూ టౌ రౌడీ', 'చంటి', 'సుందరకాండ', 'కొండపల్లి రాజా', 'పోకిరి రాజా', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'సూర్యవంశం', 'రాజా', 'శీను', 'జెమినీ', 'వసంతం', 'బాడీగార్డ్', 'సంక్రాంతి', 'ఘర్షణ', 'గురు', 'దృశ్యం', 'నారప్ప', 'దృశ్యం 2' వంటి రీమేక్‌లు ఉన్నాయి. ఇందులో 'నారప్ప', 'దృశ్యం 2' ఇంకా విడుదల కావాల్సి ఉంది.
చిరంజీవి
తన ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్తో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ఈయన కూడా రీమేక్‌ల వైపు మొగ్గు చూపారు. తన కెరీర్లో దాదాపు 17 చిత్రాలు అరువు కథలే. ఇందులో 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'విజేత', 'పసివాడి ప్రాణం', 'హిట్లర్', 'స్నేహం కోసం', 'ఘరానా మొగుడు', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాబా జిందాబాద్', 'ఖైదీ నెం.150', 'లూసిఫర్', 'వేదాళం' రీమేక్‌లు ఉన్నాయి. ఇందులో 'లూసిఫర్', 'వేదాళం' రీమేక్‌లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.
బాలకృష్ణ
అటు పౌరాణిక, జానపద చిత్రాలపై మక్కువ చాటుకుంటూనే మాస్ ప్రేక్షకుల్నీ అలరించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈయన కూడా రీమేక్‌లు చేశారు. ఇందులో 'ఆత్మబలం', 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల మామయ్య', 'లక్ష్మీ నరసింహా', 'పాండురంగడు', 'శ్రీరామరాజ్యం', 'ముద్దుల మేనల్లుడు', 'అన్నదమ్ముల అనుబంధం' వంటి చిత్రాలున్నాయి. ఇందులో 'పాండురంగడు', 'శ్రీరామరాజ్యం'.. ఎన్టీఆర్ నటించిన 'పాండురంగ మహత్యం', 'లవకుశ'లకు రీమేక్‌గా తెరకెక్కాయి.