"అమ్మో.. బాబు సినిమాలో ఫైట్స్ లేకపోతే ఎలా.. క్లైమాక్స్‌కు ముందు కచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాలి? ఇక బాబు పరిచయ సన్నివేశానికి థియేటర్లు దద్దరిల్లిపోవాలి. లేకపోతే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు."- ఇది తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోల సినిమాలంటే వినిపించే టాక్. కానీ, ఆయన సినిమాలు అలా ఉండవు.
ఒకసారి రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు.. మరోసారి ఇద్దరు పిల్లలకు తండ్రిగా మెప్పిస్తాడు.. ఇంకోసారి యోధుడిగా ఒదిగిపోతాడు. ఆయనే మలయాళ సూపర్‌స్టార్.. లాలెట్టాన్ మోహన్‌లాల్. గురువారంతో ఆయన జీవితంలో 60 వసంతాలను పూర్తి చేసుకున్నారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్‌లాల్ నటనకు ఎల్లలు లేవు.
తెలుగులోనూ..
మోహన్‌లాల్ కేవలం మలయాళ నటుడు మాత్రమే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషా సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. 1994లోనే 'గాండీవం' చిత్రంలో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించారాయన. చాలా మంది హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి ఆపసోపాలు పడుతుంటే ఇప్పటికీ ఆయన నటించిన చిత్రాలు ఏడాదికి రెండు, మూడు విడుదలవుతుంటాయి.
ఆధ్యాత్మికతే ఆయుధం..
ఏళ్లు కష్టపడితేగానీ వచ్చే 'కథాకళి'.. 'వానప్రస్థం' సినిమా కోసం అతి తక్కువ రోజుల్లో నేర్చుకున్నారు. అదీ నటన అంటే ఆయనకున్న కమిట్‌మెంట్. '
"చేసే డ్యాన్స్‌లో, పాడుతున్నప్పుడు, అన్నింటిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఇక్కడా నేను ఆ మైండ్‌ఫుల్‌నెస్ అనే విధానాన్నే పాటిస్తాను. సింపుల్‌గా చెప్పాలంటే చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. దాన్నే మనసా, వాచా, కర్మణా ఆచరించడం అనుకుందాం. దాన్నర్థం చేసుకుంటే జీవితంలో విజయాలు సాధారణ విషయాలవుతాయి." అని చెబుతుంటారు మోహన్‌లాల్.
'వానప్రస్థం'లో ఆయన నటవిశ్వరూపం చూసిన ఓ విదేశీ నటుడు.. లాల్ ఏ అమెరికాలోనో, యూరోప్‌లోనో పుడితే ఆస్కార్లన్నీ ఈయనకు వచ్చేవి అన్నారట. అందుకు మోహన్‌లాల్ ఏమన్నారో తెలుసా..? "నాకు ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ నటుడిగా రాణించడం మాత్రమే ఇష్టం. తక్కినవన్నీ నాకనవసరం" అని ఓ సందర్భంలో చెప్పారు.
ప్రస్తుతం మోహన్‌లాల్ 'బిగ్ బ్రదర్', 'మరక్కర్: అరేబియా సింహం', 'రామ్', 'దృశ్యం-2' చిత్రాల్లో నటిస్తున్నారు. గురువారం మోహన్‌లాల్‌కు తెలుగు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది శుభాకాంక్షలు చెప్పారు. ఇలాగే ఎన్నో విలక్షణ పాత్రలు పోషించాలని కోరుకున్నారు.
"హ్యాపీబర్త్‌డే మై డియర్ లాలాట్టాన్. నీలాంటి విలక్షణ నటుడు, లెజెండ్, సూపర్‌స్టార్ ఉన్న ఇండస్ట్రీలో నీకు సమకాలీకుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నువ్వు ఇలాగే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ, మరిన్ని పాత్రలు పోషిస్తూ, అభిమానులను అలరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా."