"సంగీత కచేరి అనేది ఓ హాల్‌లో చేస్తేనే అందం. నృత్యం, నాటకం అన్నవి ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తేనే ఆనందం. అలాగే ఓ సినిమాను వందల మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తేనే అద్భుతం. ఇలా కాకుండా ఇతర వేదికలపై చూడాల్సి వస్తే దాన్ని సర్దుకుపోవడమే అనుకోవాలి" అంటున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. 'గ్రహణం', 'అష్టాచమ్మా', 'జెంటిల్‌మెన్', 'సమ్మోహనం' లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో 'వి'ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో మోహన కృష్ణతో ప్రత్యేక ముఖాముఖి.
కరోనా సమయంలో షూటింగ్ ఎలా ఉండబోతుంది?
చిత్రీకరణలు జరపడమే పెద్ద సవాల్‌గా నిలవబోతుంది. ప్రభుత్వం మాకిచ్చిన నిబంధనల ప్రకారం షూట్ చేయడం చాలా కష్టం. పీపీఈ కిట్లు ధరించాలి, సూట్‌లు వేసుకోవాలి, మేకప్ వాళ్లు నటీనటులకు చాలా దగ్గరగా ఉంటుంటారు.. వాళ్లకి ఉండే సమస్యలేంటి, మిగతా విభాగాల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అని ఆలోచించాలి. నిర్మాతలు శానిటైజేషన్‌ను తమ బడ్జెట్‌లో భాగం చేసుకోవాలి. పెద్ద నిర్మాతలు దీన్ని భరించగలరు కానీ, చిన్న నిర్మాతలకు పెద్ద తలనొప్పి అయిపోతుంది. నెలాఖరు నాటికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
లాక్‌డౌన్ వస్తుందని గతంలో ఎప్పుడైనా ఊహించారా?
లేదు. నిజంగా ఇది ఓ అనూహ్యమైన విపత్తే. కరోనా ప్రమాదకరంగా కనిపిస్తుండటానికి కారణం.. చాప కింద నీరులా విస్తరిస్తుండటమే. ఇది యుద్ధాలను మించిన క్లిష్ట పరిస్థితి. ఫలితంగా మన సాంఘిక జీవనం మొత్తం దెబ్బతింటోంది. కానీ ఓ విషయం అర్థమైంది ఏంటంటే జీవితంలో మనకంత అవసరంలేని అంశాలు, వస్తువులపైన డబ్బు, సమయాన్ని వృథా చేస్తున్నామని తెలిసింది. చేతిలో ఉన్న సమయాన్ని సృజనాత్మకంగా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు.. కుటుంబ సభ్యులతో ఎంత హాయిగా గడపొచ్చన్నది అందరూ తెలుసుకోగలిగారు. ఇన్నేళ్లలో ప్రకృతి వనరుల్ని దుర్వినియోగం చేశాం. ఎంతో కాలుష్యం సృష్టించాం? అందుకే ప్రకృతి కరోనా ద్వారా ఓ హెచ్చరిక పంపింది.
'వి' సినిమా ఎలా ఉండబోతుంది?
ఈ చిత్రాన్ని ఓ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చాలా బలమైన కథతో రూపొందింది. పాత్రలు, వాటికి అర్థవంతమైన కథలు, అందులోని సంఘర్షణలు.. ఇలా భావోద్వేగాలతో నిండిన ఓ ప్రయాణంలానూ ఉంటుంది.
ఈ చిత్రాన్ని ఓటీటీల్లోకి తీసుకెళ్లాల్సి వస్తుందని భయపడ్డారా?