Mohanbabu: ఆయన మాట అగ్నిపర్వతం, మనసు మంచు పర్వతం. తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 5 వందలకు పైగా సినిమాలతో, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అశేష అభిమానగణాన్ని ఉర్రూతలూగించిన మహానటుడాయన. అల్లుడుగారిలా అల్లరి చేయాలన్నా, పెదరాయుడిలా రాజసాన్ని ఒలికించాలన్నా ఆయనకే చెల్లింది. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు జీవితం. మార్చి 19 ఆయన పుట్టినరోజు..ఈ సందర్భంగా గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మోహన్‌బాబు చెప్పిన విశేషాలు మీకోసం.
ఎంపీ స్థానం అన్నగారు(సీనియర్ ఎన్టీఆర్) ఇచ్చారా? లేక మీరు అడిగి తీసుకున్నారా?
మోహన్‌బాబు: ఏదైనా చెప్పడానికి నామోషీ అక్కర్లేదు. అన్నగారితో అనుబంధాన్ని పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. ఒకసారి చంద్రబాబును కలిసినప్పుడు 'రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. చాన్నాళ్ల నుంచి పార్టీకి ప్రచారం చేస్తున్నారు. కానీ, ఎందుకు మీరు ఏమీ అడగట్లేదు. మీరెళ్లి పెద్దాయనను ఓసారి అడగండి' అన్నారు. అన్నగారి దగ్గరికి వెళ్లి కాస్త సంకోచిస్తూ అడిగాను. ఆయన నవ్వి 'మీకిష్టమా?' అని అడిగారు. అవునన్నయ్య అన్నాను. వారం రోజుల తర్వాత 'పెదరాయుడు' షూటింగ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. 'మీకు ఎంపీ సీటు ఓకే అయింది హైదరాబాద్‌కు రమ్మ'న్నారు. వెంటనే మద్రాసు నుంచి బయలుదేరి వచ్చి అన్నయ్యను కలిశాను.
అద్దె కూడా కట్టుకోలేని స్థితి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు తీసే స్థాయికి ఎలా చేరుకున్నారు?
వయసులో ఉన్నప్పుడు ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుందని అనిపిస్తుంది. కానీ, వయసు అయిపోయేకొద్ది అసలు విషయం అర్థం అవుతుంది. భగవంతుడు ఏది ఇవ్వాలో దాన్నే మనకు ఇస్తాడు. విజయాలు, అపజయాలు ఏవైనా ఇచ్చేది ఆయనే. నాకు ఫైవ్‌స్టార్ హోటల్ పెట్టాలని ఆశ ఉండేది. ఆ ప్రయత్నంలో కొంత డబ్బు పోగొట్టుకున్నాను. మిత్రుడు రజనీకాంత్ ఒక మాట అన్నారు. జనం ఇక మనల్ని చూడలేపోతున్నారని తెలిసినప్పుడు రిటైర్ అవ్వాలన్నాడు. అది నిజమే అనిపించింది. అప్పుడే ఈ పాఠశాల పెట్టాలన్న ఆలోచన మెదిలింది. విజయం ఉంటే వంద కార్లొస్తాయి. పరాజయాలొస్తే నీతో సక్సెస్ కొట్టినవాడే దగ్గరకు రాడు. అద్దె కట్టలేని, తిండి దొరకని పరిస్థితి అనుభవించాను కాబట్టే, కులమతాలకు అతీతంగా 25 శాతం మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నాను. ఇండస్ట్రీలోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చనిపోతే ఆయన కూతురిని మా స్కూల్‌లో చదివించాను. ఇప్పుడామే తమిళంలో టాప్ హీరోయిన్. పేరు గుర్తురావట్లేదు. ఇలా చాలామంది గొప్పవారయ్యారు. అది నా గొప్పతనం కాదు. భగవంతుడి ఆశీస్సులతో జరిగింది.
ఏ ధైర్యంతో సీనియర్ ఎన్టీఆర్ మీతో 'మేజర్ చంద్రకాంత్' చేశారు?
ఒకప్పుడు ఎన్టీఆర్ ఇంటిముందు ఆయన్ను చూసేందుకు ఎదురుచూసిన వాడిని. నటుడయ్యాక అన్నగారి సొంత బ్యానర్‌లో విలన్‌గా చేసి, ఆయనతోనే శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా ఆయనతో సినిమా తీశాను. ఇదంతా భగవంతుడు నిర్ణయించింది. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో నటించమని అడిగితే 'ఎందుకు నాతో సినిమా చేస్తున్నారు. ఎవరు చూస్తార'న్నారు. మీలాంటి వ్యక్తి మళ్లీ రారు, చేయండన్నయ్య అంటే నా వ్యక్తిత్వం నచ్చి చేశారు.
అదే సినిమా వంద రోజుల వేడుకలో ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్నారు. దానికి మీరే కారణమంటారు? మీ సమాధానం.
చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, ఇప్పుడది అప్రస్తుతం. దారిలో పోయే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అభిప్రాయాలు ఏమైనా నేను గౌరవిస్తాను. అది ఆయన వ్యక్తిగత విషయం.
ఒక్క ఫసక్ అనే పదంతో చాలా పాపులర్ అయ్యారు? ఇంతకీ ఫసక్ అంటే ఏంటి?
నేను, మా అమ్మాయితో కలిసి ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. అందులో వాడిన ఫసక్ పదం, తర్వాత రోజుల్లో బాగా ట్రెండ్ అయింది. దానికి నేనేమీ బాధపడలేదు. ఆనందించాను. గర్వపడ్డాను. ఈ పదాన్ని సినిమాల్లో కూడా వాడారని అనుకుంటున్నాను.
రజనీకాంత్ 'పెదరాయుడు'లో చిన్నవేషం వేయడానికి కారణం?
వాడికే అనిపించి చేశాడు. 'పెదరాయుడు' సినిమా హక్కులు రావడానికి కారణం వాడు. ఒకసారి ఇంట్లో ఉండగా వచ్చాడు. ఆ పాత్రను నేను చేస్తానురా అన్నాడు. నాకు తండ్రిగా చేయడమేంటి రా అంటే, నేను చేస్తున్నాను అంతే అని వెళ్లిపోయాడు. అలాంటి స్నేహితుడు ఉన్నందుకు గర్విస్తాను. మేం నటించిన రోజులన్నీ గోల్డెన్ డేస్. ఆ రోజులు వేరు. అప్పుడు విలువలుండేవి. ఇప్పుడు 95 శాతం అవి ఎక్కడా కనిపించట్లేదు. నిర్మాత దేవుడు. సినిమాకు పనిచేసే వాళ్లంతా కూలీలంటాను.
అవును. నేనూ ప్రతి ప్రోగ్రామ్‌లో అదే చెప్తాను.