ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సెప్టెంబర్ 28న 90వ పడిలోకి అడుగుపెట్టిన లత గురించి... మన్‌కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
" లతా మంగేష్కర్ సంగీతంలో చేసిన సేవ మరెవరూ చేయలేరు. మనందరి కంటే ఆమె పెద్దవారు. ఎన్నో తరాలను ఆమె ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఆమెను అందరం 'దీది' అని పిలవాలి. 90వ పడిలోకి అడుగుపెట్టిన లతా మంగేష్కర్‌కు నా శుభాకాంక్షలు"
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28న జన్మించారు. ఇండోర్‌లోని మరాఠీ కుటుంబానికి చెందిన పండిట్ దీన్ దయాళ్ మంగేష్కర్ ఈ గాయని తండ్రి. ఆయన రంగస్థల కళాకారుడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఇష్టం ఏర్పడింది. లత అసలు పేరు 'హేమ'. తర్వాత ఆమె పేరును లతగా మార్చారు ఆమె తల్లిదండ్రులు. ఐదేళ్ల వయసు నుంచే సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. తొలుత నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. తర్వాత పూర్తిగా సంగీతంపైనే దృష్టి పెట్టారు.