బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్ట్ బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందిన రాజ్‌ను అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో సోమవారం ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఆయనకు సంబంధించిన ఎన్నో విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
బాలీవుడ్ నటి, మోడల్ సాగరికా సోనా సుమన్‌కు చెందిన ఓ పాత వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజ్ కుంద్రా మంచివాడు కాదంటూ.. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సాగరిక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'నేను ఒక మోడల్‌ను. నటిగా రాణించాలనే ఉద్దేశంలో సుమారు నాలుగేళ్ల క్రితం పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎక్కువ సినిమాల్లో నటించలేదు. లాక్‌డౌన్ సమయంలో నేను ఎదుర్కొన్న సమస్య మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గతేడాది ఆగస్టులో ఉమేశ్ కామత్ నుంచి నాకో ఫోన్ కాల్ వచ్చింది. రాజ్‌కుంద్రా నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో నాకు అవకాశమిస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరని నేను ప్రశ్నించాను. నటి శిల్పాశెట్టి భర్త అని ఉమేశ్ సమాధానమిచ్చారు'
'ఒకవేళ నేను కనుక వెబ్‌సిరీస్‌లో నటిస్తే అవకాశాలు వరుస కడతాయని.. కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్తానని నమ్మించాడు. కెరీర్‌పై ఆశతో ఆ సిరీస్‌లో నటిస్తానన్నాను. వెంటనే ఆయన ఆడిషన్ చేయాలని సూచించారు. కొవిడ్ వల్ల ఆడిషన్‌కు రాలేనని సమాధానమిచ్చాను. వీడియో కాల్ ద్వారా ఆడిషన్ తీసుకుంటామని అన్నాడు. నేను దానికి అంగీకరించాను. అయితే, ఆయన చెప్పిన సమయానికి ఆడిషన్ కోసం వీడియో కాల్‌లో జాయిన్ కాగానే.. నగ్నంగా ఆడిషన్ ఇవ్వమని చెప్పారు. నేను షాకయ్యాను. అలాంటివి నేను చేయనని ఆ కాల్ నుంచి వైదొలగాను. అయితే, నన్ను ఆడిషన్ చేసిన వారిలో ముగ్గురు వ్యక్తులున్నారు. అందులో ఒకరు ముఖానికి ముసుగు వేసుకున్నారు. నాకు తెలిసి ఆ వ్యక్తి రాజ్‌కుంద్రానే. అమ్మాయిల జీవితాలతో వ్యాపారం చేస్తున్న అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి' అని గతంలో సాగరిక ఆరోపించారు.