ఆయన పాట పంచామృతం. మనసు తాకే మధుర తుషారం. మోహనం. సమ్మోహన రాగ సరాగం. మధువనాలను మళ్లీ మళ్లీ పూయించిన పాటల తోటమాలి. సప్త స్వరమాలి. వైవిధ్య బాణీల మాంత్రికుడు. గోదావరి తీరాన ప్రవహించిన రసఝరి. ఆ గానామృతం ఎంతో రుచి. మూసబాణీలతో విసిగి మాధుర్యగీతాలకు వేచివున్న శ్రోతలకు..సమయానికి తగుబాణీలిచ్చి రసడోలికల్లో ఓలలాండిచిన ఆయన మరకతమణి కీరవాణి. ఆ సంగీతం పెరటి జాంపండులా తీయగా, సీతారామయ్యగారి మనవరాలి వాయులీనంలా హృద్యంగా, పెళ్లి సందడిలో సన్నాయి పాటలా ఉంటుంది.
వేలాది గీతాలు అతడి స్వరాల పల్లకిలో విహరిస్తూ పరిమళభరితంగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. హుషారైన వయసులో జీవన సంధ్యకు చేరిన విషాద మల్లిక మోమున నవ్వులు పూయించిన బాణీలు (ట్యూన్స్) అవి. నాటకాల జగతిలో జ్ఞాపకాల జావళి అంటూ జీవనవేదాంతాన్ని అక్షరీకరించిన పాట అయినా, లాలూదర్వాజ లష్కరు అనే హుషారుగా రాసిన పాటకయినా కీరవాణి అద్దిన సంగీతం గుర్తుండిపోతుంది.
నిప్పులా కాలే మనసుకు మంట శబ్దం కావాలి. ఏ అకాస్టిక్సో తెలియదు. 'అంతం' సినిమాలో (ఈ ఒక్కపాటకే సంగీతం అందించారు) 'గుండెల్లో దడదడ' అనే పాటకు కీరవాణి ఓ ఎఫెక్ట్‌ను అద్భుతంగా పలికించారు. శృంగార గీతాలకు భువనచంద్ర ఒక బ్రాండు. 'అల్లరి ప్రియుడు'లో ఆయన రాసిన 'కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను' గీతానికి కీరవాణి సంగీతం అద్భుతం.
'పుణ్యభూమి నాదేశం' ఎన్టీఆర్కు చివరి పాట. దీనికి తారస్థాయి సంగీత బాణీలు సమకూర్చారు కీరవాణి. 'ఇది రాయలసీమ గడ్డ' అని ఎన్టీఆర్ తనయుడికి' సీతయ్య'లో ఓ పాట. 'పెళ్లిసందడి' చేసిన నవమన్మధుడు కీరవాణి బాణీల్లో ఒదిగిపోయారు. కీరవాణి పాట తెలుగు ఇంటి పెరటిలో మందారం.