Miss World: ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పంజా విసిరింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన పలువురు అభ్యర్థులు కొవిడ్ బారిన పడ్డారు. భారత్ నుంచి వెళ్లిన మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కూడా వైరస్ సోకింది. దీంతో పోటీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు నిర్వాహకులు మిస్ వరల్డ్ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ప్రకటించారు.
నిజానికి మిస్ వరల్డ్ 2021 పోటీలు ప్యూర్టోరికో వేదికగా డిసెంబరు 16న ప్రారంభించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రానున్న 90 రోజుల్లో పోటీలను రీషెడ్యూల్ చేయనున్నట్లు ప్రకటించారు. మిస్ వరల్డ్ 2021 పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు, సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మిస్‌ఇండియా ఆర్గనైజేషన్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం మానస.. ప్యూర్టోరికోలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.