ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికాసింగ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరైన అతడు... ఓ సంగీత ప్రదర్శన ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మికాపై నెటిజన్లు సహా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) అతడిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధం ఫలితంగా దేశంలోని అన్ని నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రొవైడర్స్ ఇక నుంచి మికా సింగ్‌తో పనిచేయకూడదని ఆదేశించింది ఏఐసీడబ్ల్యూఏ. ఒకవేళ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మికా సింగ్‌తో పనిచేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.