తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మిడిల్ క్లాస్ మెలొడీస్' రివ్యూ: రాఘవ హోటల్​ పెట్టాడా? - వర్ష బొల్లమ్మ వార్తలు

టాలీవుడ్​ యువ కథానాయకుడు ఆనంద్​ దేవరకొండ నటించిన కొత్త చిత్రం 'మిడిల్​క్లాస్​ మెలోడిస్​'. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల శుక్రవారం (నవంబరు 20) ముందుకొచ్చింది. గుంటూరులో హోటల్​ పెట్టాలనే రాఘవ కల నెరవేరిందా? లేదా?

Middle Class Melodies movie review
రివ్యూ: హోటల్​ పెట్టాలనే రాఘవ ఆశయం నెరవేరిందా?

By

Published : Nov 20, 2020, 9:59 AM IST

చిత్రం: మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌

తారాగణం: ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి తదితరులు

సంగీతం: స్వీకార్‌ అగస్తీ, ఆర్‌హెచ్‌ విక్రమ్‌

మాటలు, కథ, కథనం:జనార్దన్‌ పసుమర్తి

దర్శకత్వం :వినోద్‌ అనంతోజు

నిర్మాత:వి.ఆనంద్‌ప్రసాద్‌

విడుదల:20/11/20 (అమెజాన్‌ ప్రైమ్‌)

మన తెలుగు సినిమాల్లో హీరో ఎక్కువగా మధ్య తరగతి యువకుడిగానే కనిపిస్తాడు. అయితే ఆలోచనలు, ఆశయాలు అంతకుమించి ఉంటాయి. వాటిని మనం తప్పు పట్టలేం కానీ... అలాంటి యువకుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకోవడం, దాని కోసం తపన పడటం, గెలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికర అంశమే. అలాంటి కథాంశంతో రూపొందిన సినిమా 'మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌'. ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ఆసక్తిరేకెత్తించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేడు ( 20/11/20)న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఆనంద్​ దేవరకొండ

కథేంటంటే:

గుంటూరులో హోటల్‌ పెట్టి వ్యాపారం చేయాలనేది రాఘవ(ఆనంద్‌ దేవరకొండ) ఆశయం. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈలోగా తండ్రి సొంతూరు కొలకలూరులో నడుపుతున్న హోటల్‌లో సాయంగా ఉంటుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి హోటల్‌ పెడతాడు. ఆ హోటల్‌ వ్యాపారం ఎలా సాగింది? ఈ క్రమంలో రాఘవ ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేది కథ. దీనికి అంతర్లీనంగా తన కాలేజీ నాటి ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనే ట్రాక్‌ సాగుతుంటుంది?. మరి ఈ హోటల్‌ ప్రేమకథలో రాఘవ ఏం చేశాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
మధ్యతరగతి సినిమాలు, గ్రామీణ నేపథ్య సినిమాలు... టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు ఈ రెండూ ఎప్పుడూ ఆకట్టుకునే అంశాలే. ఇలాంటి సినిమాల్లో ఉండే ఎమోషన్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. తొలి సినిమాగా ఈ నేపథ్యాన్ని ఎంచుకుని వినోద్‌ అనంతోజు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కుర్రాడి ఆశయం, ప్రేమ మధ్య వచ్చే ఘర్షణ యువతకు కిక్‌ ఇస్తుంది. ఇందులో అదే చూపించారు. హోటల్‌ పెట్టి జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలనుకునే రాఘవ అనే కుర్రాడి కథే ఈ సినిమా. దాని కోసం అతడు ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఒక ప్లాట్‌, ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడనేది ఇంకో ప్లాట్‌. ఈ రెండింటినీ జాగ్రత్తగా నడిపించాడు దర్శకుడు.

వర్ష బొల్లమ్మ

కీలక పాత్రల ఎంపిక విషయంలో పేరు మోసిన ఆర్టిస్ట్‌లను కాకుండా, నాటకాల అనుభవం, చిన్న చిన్న పాత్రలు చేసి పెద్దగా పేరు రానివారిని తీసుకుని సినిమాకు ఫ్రెష్‌ లుక్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తెలిసిన పాత కథే అయినా ఈ ఫ్రెష్‌ లుక్‌ చాలా పెద్ద మార్పు చూపించింది. గ్రామీణ నేపథ్యంలోని సన్నివేశాలు, తండ్రీ-కొడుకు మధ్య వచ్చిన సన్నివేశాలు సినిమాకు ప్రాణం. పెద్దగా ప్రేమ సన్నివేశాలు లేకపోవడం వల్ల డ్యూయెట్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రేమకథలో డ్యూయెట్లు ఉంటే ఆ మజానే వేరు కదా.

ఎవరెలా చేశారంటే

మధ్యతరగతి యువకుడిగా ఆనంద్‌ దేవరకొండ ఆకట్టుకున్నాడు. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడికి ఉండే ఫ్రస్టేషన్‌, ఫన్‌ చక్కగా చూపించాడు. అయితే సంభాషణలు పలికే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రేమించిన వాడిని దక్కించుకునేందుకు తండ్రితో గొడవపడి, మానసికంగా నలిగిపోయే పాత్రలో కథానాయిక వర్ష బొల్లమ్మ కూడా చక్కగా నటించింది. ఎమోషన్స్‌ని కళ్లలో పలికించిన తీరు బాగుంది. సినిమాలో ఈ ఇద్దరి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర హీరో తండ్రిది. ఆ పాత్రలో గోపరాజు రమణ వావ్‌ అనిపించాడు. సినిమా సాంతం ఒకే ఎనర్జీతో కోపిష్ఠి తండ్రిగా సూపర్‌ అనిపించాడు. ఆనంద్‌ స్నేహితుడి పాత్రలో చైతన్య ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో ఆకట్టుకున్నాడు. సురభి ప్రభావతి, ప్రేమ్‌సాగర్‌, ప్రభావతి వర్మ, దివ్య శ్రీపాద తమ పాత్ర మేరకు చక్కగా నటించారు.

చైతన్య, ఆనంద్​ దేవరకొండ

మధ్యతరగతి నేపథ్యంలో సినిమా అంటే ఇల్లు, పరిసరాలు మాత్రమే చూపిస్తే చాలు అనుకుంటుంటారు. ఈ సినిమాలో దాంతోపాటు మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, నవ్వులు, సరదాలు, కోపాలు అన్నీ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ పేరుకు తగ్గట్టే పేస్ట్‌కి రాయితో రుద్ది తీయడం, వాట్సాప్‌లో దేవుడి ఫొటో ఫార్వార్డ్‌ చేస్తే మంచిది అనుకోవడం, కాకా హోటల్‌లో పేపర్‌ చదువుతూ ముచ్చట్లు, స్థలాల అమ్మకాల వ్యవహారం, ఊళ్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఐపీ పెట్టి వెళ్లిపోవడం వంటి సన్నివేశాలు చూపించాడు. పాటలన్నీ మాంటేజ్‌ స్టైల్‌లోనూ రూపొందించారు. అన్ని పాటలూ ఆకట్టుకున్నాయి.

"నేల మీదకి రా, గాలిలో మేడలు కడితే లాభం లేదు"... అంటూ తను చేసిందే సూపర్‌ అనుకునే కుర్రాడి కళ్లు నేలకు దిగేలా హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ సినిమాకు కీలకం. తను చేసిన చట్నీతో దోశ తిన్నాక తండ్రి స్పందన కోసం ఎదురుచూసే సన్నివేశంలో ఆనంద్‌ చక్కగా నటించాడు. జనార్దన్‌ మాటలు బాగున్నాయి. చిన్న సినిమా అంటే పంచ్‌లు, ప్రాసలు కామన్‌గా ఉన్న ఈ రోజుల్లో అవేవీ లేకుండా రాసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రకరకాల పాత్రలను ఒకే సినిమాలో గుదిగుచ్చిన సందర్భాలు గతంలో చాలా చూశాం. ఈ సినిమా కూడా అలాంటిదే. వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఇందులో కనిపిస్తారు. అయితే కొత్తదనం ఆశించేవారు కాస్త నిరాశచెందే అవకాశమూ ఉంది.

బలాలు

+ కథ నేపథ్యం

+ పాత్రల చిత్రీకరణ

+ వినోదం

బలహీనతలు

- కొత్తదనం లేకపోవడం

- తెలిసిన కథ

చివరిగా:'మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌'... బొంబాయి చట్నీ లాంటి సినిమా

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!!

ABOUT THE AUTHOR

...view details