కథకు కనెక్ట్ అయితే కన్నీళ్లు వాటంతటవే వచ్చేస్తాయని అంటోంది హీరోయిన్ మెహరీన్. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'ఎంత మంచివాడవురా..!'. నందమూరి కల్యాణ్ రామ్ హీరో. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మెహరీన్.. విలేకర్లతో సరదాగా ముచ్చటించింది. ఆ విశేషాలివే
సంక్రాంతికి నా సినిమా రావడం అదృష్టం
నేను నటించిన సినిమాలు ప్రతి ఏడాది ఏదో ఒక పండక్కి విడుదలయ్యేవి. కాకపోతే నాకు మాత్రం సంక్రాంతికి నా సినిమా ఒక్కటైనా విడుదలైతే బాగుండు అని అనిపించేది. అలా ఈ ఏడాది నా కోరిక తీరింది. ఈసారి నేను నటించిన రెండు సినిమాలు.. సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఒకటి తమిళంలో ధనుష్ 'పటాస్'. మరొకటి తెలుగులో కల్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడువురా..!'.
అన్నీ ఎమోషన్స్ ఉన్న పాత్ర
'ఎంతమంచి వాడవురా' సినిమాలో నా పాత్ర పేరు నందు. ఓ షార్ట్ ఫిల్మ్ నిర్మాత. ఆ అమ్మాయి చేసే సినిమాల్లోనే కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తుంటాడు. అలా ఫస్టాఫ్ అంతా మధ్య చాలా సరదాగా గడిచిపోతుంది. నేను నటించిన నందు పాత్ర బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పాత్రలో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ పాత్ర సినిమాకు కీలకం. కాబట్టి ప్రేక్షకులు తప్పకుండా నందులో కొత్త మెహరీన్‌ను చూస్తారు. ఇప్పటి వరకు నేను ఎమోషనల్ సన్నివేశాలకు గ్లిజరిన్ వాడలేదు, ఇకపైనా వాడను.