"తల్లిదండ్రుల ప్రేమ.. పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ.. పిల్లల ప్రేమ.. ఇలా జీవితంలో అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దేది ఆ ప్రేమ ఒక్కటే. అందుకే నా దృష్టిలో ప్రేమ గొప్పది. నిస్వార్థమైనది" అంటోంది నటి మేఘా ఆకాష్. ఇటీవలే 'రాజ రాజ చోర' చిత్రంతో(Raja Raja Chora Movie) ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ.. ఇప్పుడు 'డియర్ మేఘ'(Dear Megha) సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైంది. ఆమె టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది మేఘ.
- "దర్శకుడు సుశాంత్ ఓరోజు ఫోన్ చేసి తన దగ్గర నాకు సరిపడే ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉందని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఎందుకంటే నాయికా ప్రాధాన్య చిత్రమంటే చాలా ఒత్తిడి తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను పరిస్థితుల్లో కచ్చితంగా రిస్క్ చేయాలి.. కొత్త తరహా కథాంశాలు ఎంచుకోవాలి అనుకున్నాను. 'డియర్ మేఘ' కథ విన్నప్పుడు రొమాంటిక్‌గా, ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది. చక్కటి లవబుల్ ఫిల్మ్ అనిపించింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్ కూడా. అందుకే ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా".
- "అబ్బాయి.. అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఇంకా ఎన్నో రకాల ప్రేమలుంటాయి. ఈ సినిమాతో నిజమైన ప్రేమ అంటే ఏమిటి.. అన్ కండిషనల్ లవ్ ఎలా ఉంటుంది? అన్నది ప్రేక్షకులు తెలుసుకుంటారు. దీన్నొక ముక్కోణపు ప్రేమకథ అనుకోవచ్చు. ప్రతి ప్రేమకథలో ఉన్నట్లే ఇందులోనూ కొంత ట్రాజెడీ ఉంటుంది. నేనిందులో మేఘ అనే అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్రకు నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలున్నాయి. మేఘ లోపల చాలా అల్లరి పిల్ల. బయటకు మాత్రం చాలా కామ్‌గా కనిపిస్తుంటుంది. నేను కూడా అంతే".
- "ఈ చిత్ర విషయంలో నటిగా నాపై ఎప్పుడూ కొంత ఎక్కువ ఒత్తిడి ఉంటుండేది. ఎందుకంటే బరువైన పాత్ర ఇది. నేనిప్పటి వరకు ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమకథలో నటించలేదు. అరుణ్ అదిత్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి నటించడం ఇన్నాళ్లకు కుదిరింది. ఈ సినిమా విషయంలో నిర్మాత అర్జున్ నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడైనా అనుకోని కారణాల వల్ల చిత్రీకరణకు రాలేకపోయినా పరిస్థితులు అర్థం చేసుకునేవారు".
- "ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ ఉంటుంది. అలాగే నా జీవితంలోనూ ఉంది. అయితే 'డియర్ మేఘ' చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. నాలుగో తరగతిలో నా పక్కన కూర్చునే అబ్బాయిపై నాకు ఇష్టం ఏర్పడింది. నాకు తెలిసి అదే నా తొలి ప్రేమ (నవ్వుతూ). ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నేను వ్యక్తిగతంగా ప్రేమ వివాహాన్నే ఇష్టపడతా. నాకు కాబోయే భాగస్వామి నన్ను నాలా ఉండనివ్వాలి".
- "నేను చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ప్రణాళికలు వేసుకున్నాను. కానీ, ఇక్కడ మన ప్రణాళికలకు అనుగుణంగా ఏది జరగదని అర్థమైంది. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని కొన్నాళ్లకు తెలుసుకున్నా. మొదట్లో నాకంటూ కొన్ని పరిమితులుండేవి. అందుకే తగ్గ పాత్రలే ఎంచుకుని సినిమాలు చేశా. కానీ, ఇప్పుడు నా ఆలోచనా విధానం మారింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నా. ప్రస్తుతం నేను 'గుర్తుందా శీతాకాలం'లో నటిస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి".