'సైరా నరసింహారెడ్డి' సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా తన తండ్రి పనిచేశారని ఆయన తనయుడు, చిత్రనిర్మాత రామ్‌చరణ్ అన్నాడు. చిరంజీవిపై సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తక ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
"ఇదో భావోద్వేగ సమయం. నాన్న గురించి చాలా తెలుసనుకున్నా. తెలియనిది చాలా ఉంది. ఈ పుస్తకం ద్వారా ఆయనకు ఇంకా దగ్గర అవుతానని భావిస్తున్నా. ఈ బహుమతి ఇచ్చిన వినాయకరావుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 21ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. అంతకుముందు వరకూ నాన్న షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో కాసేపు సరదాగా గడిపేవాళ్లమంతే. ఎంతకష్టపడేవారో మాకు తెలిసేది కాదు. మేం నిద్ర లేచే సమయానికే షూటింగ్‌కు వెళ్లిపోయేవారు. మేం పడుకొనే సమయానికి వచ్చేవారు. 80, 90వ దశకంలో ఆయన జర్నీ గురించి అసలు తెలియదు. నేను వెండితెరకు పరిచయం అయ్యే సమయానికి నాన్నగారు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు" -రామ్‌చరణ్, హీరో-నిర్మాత
నిర్మాత అల్లు అరవింద్‌తో హీరో రామ్‌చరణ్
"నాన్న గురించి చెప్పమంటే, నా దృష్టిలో 'ఖైదీ నంబర్ 150'కు ముందు, తర్వాతగా చెబుతా. ఆ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తా. దీని తర్వాత నాన్న చాలా కొత్తగా అర్థమయ్యారు. ఉదయాన్నే లేచి అన్నిపనులు ముగించుకుని, 7.30కల్లా ఫస్ట్‌షాట్‌కు రెడీ అయ్యేవారు. 'సాధారణంగా గంట ఆలస్యంగా రావొచ్చా?' అని అడిగే ఆర్టిస్ట్‌లు ఉంటారు. కానీ, 'ఒక గంట ముందుగా షూటింగ్‌కు రావొచ్చా?' అని చిరంజీవిగారు అడిగేవారు. ఆ తర్వాత 'సైరా'కూ అలాగే కష్టపడ్డారు. ఆయనకు రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ సినిమా చేశాను. ఒక్క రోజైనా ఆయన ఫీల్ కాకుండా, నన్ను ఫీల్ కానీయకుండా సినిమా తీశారు. ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీని ఎవరూ మర్చిపోలేరు" -రామ్‌చరణ్, హీరో-నిర్మాత
"64ఏళ్ల వయసులో 250 రోజుల పాటు సినిమా కోసం కష్టపడ్డారు. లాభాలు వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నారు తప్ప... ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు. నాన్న లేకపోతే మేం లేం. ఆయనకు ఏం ఇవ్వాలో ఇప్పటికీ మాకు తెలియడం లేదు. కానీ, ఆయన మాత్రం మాకు ఏదో ఒకటి ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వినాయకరావుగారికి ధన్యవాదాలు చెబుతున్నా" -రామ్‌చరణ్, హీరో-నిర్మాత
ఈ ఈవెంట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత అల్లు అరవింద్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'మెగాస్టార్ ది లెజెండ్' పుస్కకావిష్కరణ