తెలుగు సినీ కార్మికుల సహాయార్థం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సీసీసీ అధ్యక్షుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు. "దినసరి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీకి సహృదయంతో మీ వంతు సాయం చేసినందుకు ధన్యవాదాలు సర్. చిత్ర పరిశ్రమకు మీరు చేస్తున్న సేవ అసాధారణమైంది. మీరు లెజెండ్" అని చిరు ట్వీట్ చేశారు.
సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు - సీసీసీకి రామోజీరావు విరాళం
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశారు. తాజాగా దీనికి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. దీనిపై స్పందిస్తూ ఆయనకు సీసీసీ అధ్యక్షుడు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల చిత్ర పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఆకలి తీర్చడం కోసం చిరుతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కలిసి 'సీసీసీ'ని ఏర్పాటు చేశారు. దీనికి చిరు అధ్యక్షత వహిస్తున్నారు. సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, దాము, శంకర్, బెనర్జీ, మెహర్ రమేశ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సీసీసీకి విరాళాలు ఇచ్చారు. ఈ మొత్తంతో సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.