మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. గత ఆదివారం కరోనా సోకిందని ట్విట్టర్లో తెలిపిన చిరు.. తనలో వైరస్ సోకిన లక్షణాలేవి కనిపించలేదన్నారు. అయితే మూడు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల మరోసారి పరీక్షలు చేయించుకున్నట్టు వెల్లడించిన మెగాస్టార్.. నెగిటివ్‌గా తేలినట్టు స్పష్టం చేశారు.
"కరోనా, కాలం.. ఈ రెండు కలిసి గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తర్వాత, కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల, నాకే అనుమానం వచ్చి అపోలో వైద్యులను సంప్రదించాను. వాళ్లు నాకు సీటీ స్కాన్ తీసి ఛాతి భాగంలో ఎలాంటి ట్రేసెస్ లేవని నిర్ధరణకు వచ్చారు. అక్కడ చేసిన పరీక్షలో నెగిటివ్‌గా వచ్చాక.. మరోచోట నివృత్తి చేసుకుందామని మరో మూడు రకాల కిట్స్‌లతో పరీక్షలు చేయించాను. అన్నింటిలోనూ నెగిటివ్‌గా తేలింది. చివరిగా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీ-పీసీఆర్‌తో పరీక్ష చేయించాను. అక్కడా వైరస్ లేదని తెలిసింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు తప్పుగా వచ్చిందని వైద్యులు నిర్ధరణ చేశారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు."