కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్రీకరణ జరుపుకుంటున్న తన సినిమాను తక్షణం వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.
'ఆచార్య' షూటింగ్ వాయిదా.. చిరంజీవి ప్రకటన
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన కొత్త సినిమా షూటింగ్‌ను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
"కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరం. ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనాపై మరింత అప్రమత్తత అవసరం. కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం అభినందనీయం. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలి. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. కరోనా పాజిటివ్ వచ్చిన నెల్లూరులో పాఠశాలలు, మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్స్ పూల్స్ మూసివేయడం వల్ల వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకున్నట్టు అయింది. పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను" -చిరంజీవి, ప్రముఖ నటుడు
"సినిమా షూటింగ్స్‌లో పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేస్తే బాగుంటుందని భావిస్తున్నా. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు వెంటనే అంగీకరించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం పాలు పంచుకోవాలని కోరుతున్నా. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను" -మెగాస్టార్ చిరంజీవి