తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడి కోసం పోలీసులు చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడారు ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. పోలీసుల వల్లే ఈ వైరస్ విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చిందని చెప్పారు.
లాక్డౌన్ అమలులో సామాన్య ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పంచుకున్నారు చిరంజీవి.
"కరోనా కట్టడి కోసం దేశం సాగిస్తున్న సమరంలో సైనికుల్లా ప్రాణాలకు తెగించి ముందుండి పోరాడుతున్న వారిలో పోలీసులదీ కీలక పాత్రే. ఈ క్లిష్ట సమయాల్లో రేయింబవళ్లు ఎంతో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే వారి సేవలకు ఓ పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా.
రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వాళ్ల పనితీరు వల్లే లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. దీని ఫలితంగానే కరోనా వ్యాప్తి చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఈ మహమ్మారిని అంతమొందించడంలో అందరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నా."