కరోనా పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమలో చిత్రీకరణల సందడి కనిపించనప్పటికీ.. కొత్త కథలు సిద్ధం చేసుకోవడంలో దర్శకులు జోరు చూపిస్తూనే ఉన్నారు. ఈ విరామ సమయాన్ని చక్కగా వినియోగించుకొని చకచకా కొత్త స్క్రిప్ట్‌లు పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు బాబీ కూడా అగ్ర కథానాయకుడు చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ కలయికలో ఓ చిత్రం రానుందని చిరు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడా ప్రాజెక్టు కోసమే బాబీ కథను పూర్తి చేసినట్లు సమాచారం. మెగాస్టార్ శైలికి తగ్గట్లుగానే వైవిధ్యభరితమైన కథాంశంతో అన్నిరకాల వాణిజ్య హంగులతో ఈ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే చిరు ఈ కథ విన్నారని, కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించగా ఇప్పుడు వాటన్నింటినీ బాబీ పూర్తి చేశారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి కోసం మరో కథ సిద్ధం
లాక్‌డౌన్‌తో వచ్చిన విరామ సమయంలో చిరు కోసం యువ దర్శకుడు బాబీ కొత్త కథ సిద్ధం చేశారట. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా రానుంది.
హీరో చిరంజీవి
ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రం పూర్తయిన తర్వాతే ఈ సినిమా ప్రారంభంపై స్పష్టత రానుంది. ఎందుకంటే ప్రస్తుతం చిరు కోసం మరో యువ దర్శకుడు సుజీత్ 'లూసిఫర్' రీమేక్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో ముందు సెట్స్‌పైకి వెళ్లాలన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి చిరంజీవి నిర్ణయించుకోనున్నారని తెలుస్తోంది.